24 గంటల్లో సామాన్యులకు తక్కువ ధరకే.. ‘మన ఇసుక వాహనం’ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం ఇందిరమ్మ ఇళ్లు.. ప్రభుత్వ పనులకు ప్రాముఖ్యత గుర్తించిన ఇసుక రీచ్‌ల నుంచి రవాణా
సద్వినియోగం చేసుకోవాలి
కొత్తపల్లి(కరీంనగర్): ఇసుక అక్రమ రవాణాను అరికట్టి, సామాన్యులకు తక్కువ ధరకే అందించేందుకు ప్రభుత్వం ‘మన ఇసుక వాహనం’ యాప్‌ను తీసుకువచ్చింది. వినియోగదారులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే 24 గంటల్లోపు ఇంటికే ఇసుక సరఫరా అవుతుంది. ఇసుక వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ అమర్చడం వల్ల అక్రమ రవాణాను గుర్తించవచ్చు. స్మార్ట్‌ఫోన్ లేని వారు పంచాయతీ కార్యదర్శి ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. కొత్తపల్లి మండలం ఎలగందుల, ఖాజీపూర్ శివారుల్లోని మానేరు వాగులో రీచ్‌లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
ఇందిరమ్మ ఇళ్లకు..
ఇందిరమ్మ ఇళ్లకు, ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఈ రీచ్‌ల్లో ఇసుక తీసుకునేందుకు ప్రాధాన్యతనివ్వనున్నారు. చాలాచోట్ల ఇందిరమ్మ ఇళ్లు ఇసుక లేక నిలి చిపోతున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకే ప్రభుత్వం ఎంపిక చేసిన రీచ్‌ల్లో ఇసుక తవ్వుకునే అవకాశమి చ్చింది. వినియోగదారులు gmiv. cgg. gov. in వెబ్‌సైట్ ద్వారా ఇసుక బుక్ చేసుకోవచ్చు.
ఐదు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా..
ఇసుక నూతన విధానాన్ని కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పైల ట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఈ జిల్లాల్లో ఫలితాలను బట్టి త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనున్నారు. నేరుగా ప్రభుత్వ పోర్టల్ ద్వారా బుకింగ్ జరగడం వల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. దూరాన్ని బట్టి ధరలను నిర్ణయించడం వల్ల విని యోగదారులపై అదనపు ఆర్థిక భారం పడదు. ఇసుక లోడ్‌తో బయలుదేరిన ప్రతి వాహనానికి జీపీఎస్ పరికరాన్ని అమర్చుతారు. దీంతో వాహనం ఏ మార్గంలో వెళుతోంది..? ఎక్కడ ఆగుతోంది అనే వివరాలను అధికారులు పర్యవేక్షించవచ్చు. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి రెవెన్యూ, పోలీస్, రవాణా, మైనింగ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 2017లో పెద్దపల్లి జిల్లాలో ‘స్యాండ్ టాక్సీ’ పేరుతో ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టినా కొన్ని కారణాలతో నిలిచిపోయింది. ఇప్పుడు టెక్నాలజీని జోడించి మరింత పకడ్బందీగా దీనిని అమలు చేస్తున్నారు. తహసీల్దార్లు, ఆర్డీవోలు అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు.


