కరీంనగర్ టౌన్: కరీంనగర్ మున్సిపల్ ఎన్నిక ల సమయంలో తన డివిజన్‌లోని దంపతులకు ఆడపిల్ల పుడితే రూ.10వేలు అందిస్తానని ఇచ్చిన హామీని మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ నెరవేర్చా రు. డివిజన్‌కు చెందిన పైండ్ల రవళి, ప్రశాంత్ దంపతులకు ఆడపిల్ల జన్మించగా ఆ మొత్తాన్ని ఆదివారం అందించారు. రవీందర్ సింగ్ మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆడబిడ్డ పుట్టిన ఇంట్లో ఆనందం రెట్టింపు కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని తెలిపారు.
సభకు తరలిన బీజేపీ శ్రేణులు
కరీంనగర్: సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ సభకు జిల్లా నుంచి భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు తరలివెళ్లారు. కరీంనగర్ నుంచి వెళ్లిన వాహనాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే లక్ష్యంతో జిల్లానుంచి 120 ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులతో పాటు దాదాపు 500 సొంత వాహనాల్లో సభకు తరలి వెళ్లారన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుగ్గిళ్ల రమేశ్, ఉపాధ్యక్షుడు సాయిని మల్లేశం, సీనియర్ నాయకుడు గుజ్జ శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పుప్పాల రఘు, అసెంబ్లీ కన్వీనర్ పేరుక శ్రావణ్, ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు భూముల అనిల్ పాల్గొన్నారు.
నైపుణ్యం పెంచుకోవాలి
కరీంనగర్ టౌన్: కళాకారులు శిక్షణ ద్వారా నైపుణ్యాన్ని పెంచుకోవాలని తెలంగాణ ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ అన్నారు. కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో జరుగుతున్న ఉమ్మడి జిల్లా తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. నర్సింహ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో కళాకారులు ఉ పాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జానపదం, యక్షగాన, బుర్రకథ, ఒగ్గుకథ, వీధి బాగోతం కళాకారుల బతుకులు దుర్భరంగా ఉన్నాయని, వారికి గుర్తింపు కార్డులతో పాటు పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ అనుబంధమైన తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభలు ఈనెల 25, 26వ తేదీల్లో హైదారాబాద్‌లో జరగనున్నాయని, విజయవంతం చేయాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, ఇఫ్టా జాతీయ కౌన్సిల్ సభ్యుడు కవ్వంపల్లి స్వామి, అందె స్వామి, కన్నం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.


