బీఆర్‌ఎస్‌ బంద్‌ ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ బంద్‌ ప్రశాంతం

May 10 2026 8:04 AM | Updated on May 10 2026 8:04 AM

● ఎమ్మెల్యే గంగుల, బీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్‌

కమలాకర్‌ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

షాప్‌ మూసివేయిస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

టవర్‌ సర్కిల్‌లో సీపీ గౌస్‌ ఆలం పర్యవేక్షణ

కరీంనగర్‌టౌన్‌: కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ క్యాంప్‌ కార్యాలయంపై దాడి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ శనివారం బీఆర్‌ఎస్‌ చేపట్టిన కరీంనగర్‌ బంద్‌ ప్రశాంతంగా సాగింది. పోలీసులు ముందస్తుగా కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు, మానకొండూర్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు, రసమయి బాలకిషన్‌, చొప్పదండిలో సుంకె రవిశంకర్‌ను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, రవీందర్‌ సింగ్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి, పొన్నం అనిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు గంగుల ఇంటికి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. గంగుల బయటికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నల్ల జెండాలతో రోడ్డెక్కేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకొని పీటీసీకి తరలించారు. పలువురు కార్యకర్తలు కోర్టు చౌరస్తాలో బీజెపీ, కాంగ్రెస్‌ పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.

రోజంతా హైరానా

బంద్‌లో పాల్గొనవద్దని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు వ్యాపార వాణిజ్య సంస్థలు, ప్రజలకు పిలుపునివ్వడం, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ బంద్‌ జరిగి తీరుతుందని ప్రజలు సహకరించాలని కోరడంతో నగరంలో హైటెన్షన్‌ నెలకొంది. ఎక్కడ చూసినా పోలీసు బలగాలు మోహరించడంతో ప్రజలు హైరానా పడ్డారు.

అనంతరం గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రభుత్వ ఆస్తులు, ప్రజా ప్రతినిధులపై దాడులకు దిగడం అప్రజాస్వామికమన్నారు. ప్రజలపై ఒత్తిడి తెచ్చి బంద్‌ను విఫలం చేయాలనే ఉద్దేశంతో వ్యవహరించినా ప్రజలు బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు. గుగ్గిళ్ల జయశ్రీ, తిరుపతినాయక్‌, బోనాల శ్రీకాంత్‌, జమీలోద్దీన్‌, గందె మాధవి, ఎడ్ల అశోక్‌, మైకెల్‌ శ్రీనివాస్‌, సోహన్‌ సింగ్‌, లక్ష్మయ్య, శ్యాంసుందర్‌ రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, దిండిగాల మహేశ్‌, పావని, రుద్ర రాధ, గంటల రేణుక పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement