హలో.. టీజీఎన్‌పీడీసీఎల్‌ | - | Sakshi
Sakshi News home page

హలో.. టీజీఎన్‌పీడీసీఎల్‌

May 10 2026 8:04 AM | Updated on May 10 2026 8:04 AM

● కొత్తగా ఏఐ ‘వాట్సాప్‌ చాట్‌ బాట్‌‘ విద్యుత్‌ సేవలు ● 8712481489 వాట్సాప్‌ నంబర్‌తో ఫిర్యాదుల స్వీకరణ

కొత్తపల్లి(కరీంనగర్‌): వినియోగదారులకు పారదర్శక విద్యుత్‌ సేవలు అందించాలనే లక్ష్యంతో ఉత్తర విద్యుత్‌ పంపిణీ సంస్థ ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఇప్పటికే విద్యుత్‌ యాప్‌ ద్వారా సేవలందిస్తున్న సంస్థ మరింత వేగవంతంగా వినియోగదారులను చేరుకునేందుకు ‘వాట్సాప్‌ చాట్‌ బాట్‌‘ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏఐని జోడిస్తూ తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో ఈ ఫీచర్‌ సేవలందించనుంది. ఎంచుకున్న భాషలో వినియోగదారుడి ప్రశ్నను ఏఐలో విశ్లేషించి సమాచారం ఇవ్వనుంది. ఎటువంటి విద్యుత్‌ సమస్య తలెత్తిన 1912 టోల్‌ ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచిన విద్యుత్‌ సంస్థ కొత్తగా ఏఐ ఆధారిత వాట్సాప్‌ ఫీచర్‌ను 24/7 వినియోగంలోకి తెచ్చింది. టీజీఎన్‌పీడీసీఎల్‌ పరిధిలోని 18 జిల్లాల్లో గల 70.39 లక్షల వినియోగదారులకు వేగవంతమైన సేవలందించేందుకు విద్యుత్‌ సంస్థ సిద్ధమైంది.

8712481489 వాట్సాప్‌ నంబర్‌ ద్వారా సేవలు

మొదటగా వినియోగదారులు తమ మొబైల్‌ నుంచి వాట్సాప్‌లో 8712481489 సంప్రదించి అవరమైన సేవలను సులభంగా పొందవచ్చు. వినియోగదారుడి ప్రస్తుత బిల్లు మొత్తం, చెల్లింపు తేదీ వివరాలు, చెల్లించిన బిల్లు వివరాలు అందుబాటులో ఉంటాయి. తెలుగు, ఇంగ్లిష్‌ భాషలో ఫిర్యాదు చేస్తే టికెట్‌ ఇస్తుంది. ఈ టికెట్‌ ఆధారంగా ఫిర్యాదు స్థితిగతులను తెలుసుకోవచ్చు. వినియోగదారులు ఉంటున్న ప్రాంతంలోని ప్రస్తుత అంతరాయ స్థితులను తెలుసుకోవచ్చు. చాట్‌బాట్‌కు సమాధానం చెప్పలేని, పరిష్కరించలేని సమస్య తలెత్తినప్పుడు వినియోగదారుని ఏజెంట్‌కు తరలించి సమస్య పరిష్కరించబడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement