మాటలు.. మంటలు.. దాడులు! | - | Sakshi
Sakshi News home page

మాటలు.. మంటలు.. దాడులు!

May 9 2026 9:49 AM | Updated on May 9 2026 9:49 AM

శుక్రవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

పరస్పర దాడులకు దారి తీసిన బండి–పాడి విమర్శలు

ఎమ్మెల్యే పాడిపై దాడికి యత్నించిన బీజేపీ శ్రేణులు

హుజూరాబాద్‌లో పరస్పర దాడులు

సీఎంపై మాట్లాడితే దాడులు కొనసాగుతాయన్న కాంగ్రెస్‌

పోలీసుల అప్రమత్తతతో

తప్పిన ఉద్రిక్తతలు

నోరు అదుపులో పెట్టుకో

దాడులు కొనసాగుతాయి

దాడులు సిగ్గు చేటు

శుక్రవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2026

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌/కరీంనగర్‌ టౌన్‌:

కేటీఆర్‌పై కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ చేసిన విమర్శలు, దానిని ఖండిస్తూ హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడికౌశిక్‌ రెడ్డి చేసిన ప్రతివిమర్శలు భౌతికదాడులకు దారితీశాయి. గురువారం ఉదయం కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండిపై కౌశిక్‌ చేసిన వివాదాస్పద విమర్శలతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. పలువురు కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు కర్రలతో ఎమ్మెల్యే కార్యాలయం మీద దాడికి దిగారు. గన్‌మన్లు కౌశిక్‌ను లోపల గదికి తరలించి ఆయనపై దాడిని తప్పించారు. కౌశిక్‌ చిక్కకపోవడంతో ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయం ఫర్నిచర్‌ను అక్కడే ఉన్న పాడి కారును బీజేపీ నేతలు ధ్వంసంచేశారు. అనంతరం బీఆర్‌ఎస్‌ నాయకురాలు పావనిగౌడ్‌ ఇంటి మీద దాడిచేశారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లిన బీఆర్‌ఎస్‌ నేతలను అడ్డగించిన బీజేపీ నాయకులు సంపత్‌గౌడ్‌ అనే బీఆర్‌ఎస్‌ నాయకుడి తలపగులగొట్టారు. అనంతరం పాడికౌశిక్‌ తీరుపై నిరసన వ్యక్తం చేసేందుకు పలువురు బీజేపీ నాయకులు హుజూరాబాద్‌ తరలేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. మరోవైపు హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు నిరసనకు దిగడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకున్నారు. పరస్పర వ్యతిరేక నినాదాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. మొత్తానికి ఇటు కరీంనగర్‌లో అటు హుజూరాబాద్‌లో పోలీసుల అప్రమత్తతో ఉద్రిక్త పరిస్థితులను నివారించగలిగారు. ఇంకోవైపు పాడి కౌశిక్‌పై చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాదులు సోమిరెడ్డి వేణు ప్రసాద్‌, కొలిపాక చంద్రమౌళి, కామారపు విశ్వ ప్రసాద్‌, కనుకయ్య పెద్దపెల్లి జితేందర్‌ రెడ్డి, శ్రీలేఖ, ఊస కోయిల రమేశ్‌, వెన్న ఆనందం కోరారు.

ఘటనపై ఎవరేమన్నారంటే..

లా అండ్‌ ఆర్డర్‌ ఉందా?: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి

శాసనసభ్యుడినైన తనను చంపేయత్నం జరిగింది. అసలు కరీంనగర్‌లో లా అండ్‌ ఆర్డర్‌ ఉన్నాయా? ఈ విషయంలో సీఎం, బండి ఒక్కటయ్యారు. ఎమ్మెల్యేపైనే దాడులు చేస్తే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? దాడులకు భయపడం. నోటికివచ్చినట్లు తిట్టి ఇదేంటని అడిగితే దాడులు చేస్తారా?

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్‌ నాయకుల నిరసన

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ గురించి మాట్లాడేటప్పుడు కౌశిక్‌ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. డ్రగ్స్‌ టెస్టుకు సంజయ్‌ ఇచ్చిన గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో కేటీఆర్‌ భయపడుతున్నారని కౌశిక్‌ మాటల ద్వారా అర్థం అవుతుంది.

– ప్రవీణ్‌రావు, బీజేపీ పార్లమెంట్‌ కన్వీనర్‌

‘మిస్టర్‌ కౌశిక్‌ రెడ్డి ఇకనైనా నోరు అదుపులో పెట్టుకో. వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం మానుకోకపోతే ఇదేవిధంగా దాడులు కొనసాగుతాయి. తెలంగాణలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది. చెడగొట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు.

– ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,

డీసీసీ ప్రెసిడెంట్‌ కరీంనగర్‌

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ స్వయంగా దాడులు చేయించడం సిగ్గుచేటు. కరీంనగర్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంపై దాడికి తెగబడి, ఆఫీస్‌ ఫర్నిచర్‌, అద్దాలు, కారు ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నాం.

– జీవీ రామకృష్ణారావు,

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు

Advertisement
 
Advertisement
Advertisement