● డ్రగ్స్ మత్తులో మాట్లాడుతున్న కేటీఆర్ ● సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి
కరీంనగర్ కార్పొరేషన్: బీజేపీ, బీఆర్‌ఎస్ చీకట్లో రహస్య ఒప్పందాలు చేసుకొని బహిరంగంగా కొట్టుకొన్నట్లు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ మేయర్, కోఆప్షన్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ పరస్పరం సహకరించుకోవడం అందరికీ తెలిసిందేనన్నారు. అవసరమైనప్పుడు సహకరించుకుంటూ.. మరోవైపు తిట్టుకుంటూ.. పరస్పరం దాడులు చేసుకుంటూ ప్రజాపాలనను అపవాదుకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడితే బుద్ధి చెప్తామని హెచ్చరించారు. డ్రగ్స్ మత్తులో ఉండి కేటీఆర్ ఇంకా తానే రాజనుకుంటున్నాడని ధ్వజమెత్తారు. జువెల్లరీ షాప్‌లో జరిగిన దొంగతనంపై పోలీసులు దర్యాప్తు చేస్తుంటే.. కౌశిక్‌రెడ్డి కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని విమర్శించారు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, చాడగొండ బుచ్చిరెడ్డి, సరిళ్ల ప్రసాద్, పడిశెట్టి భూమయ్య, కాంతాల జగన్‌రెడ్డి, పర్వతం మల్లేశం, గంట శ్రీనివాస్, ఎండీ తాజొద్దీన్, కొరివి అరుణ్‌కుమార్, మహమ్మద్ అమీర్, అబ్దుల్ రెహమాన్ పాల్గొన్నారు.
కరీంనగర్ నుంచి విహార యాత్రకు బస్సులు
విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్–2 డిపో నుంచి మైసూర్ మీదుగా ఊటి విహార యాత్రకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఈనెల 15న మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి బయలుదేరుతుందని డిపో–2 మేనేజర్ ఎం.శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 16న మైసూర్‌లో మైసూర్ ప్యాలెస్, చాముండే టెంపుల్, బృందావన్ గార్డెన్ మొదలగు ప్రదేశాలు చూసి అదేరోజు మైసూర్లో బస చేసి 17న ఉదయం 4 గంటలకు మైసూర్ నుంచి బయలుదేరి ఊటి వెళ్తుందన్నారు. ఊటిలో రెండు రోజులపాటు బస చేసి ఊటిలోని వివిధ ప్రదేశాలు సందర్శించి 18న రాత్రి డిన్నర్ తరువాత బెంగళూరు చేరుకుంటుందని చెప్పారు. బొటానికల్ గార్డెన్, ఇస్కాన్ టెంపుల్, బెంగళూరు ప్యాలెస్ సందర్శన అనంతరం బెంగళూరు నుంచి బయలుదేరి 21న కరీంనగర్ చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ.6వేలు, పిల్లలకు రూ.4,500 టికెట్ ఉంటుందని, భోజనం ఖర్చులు, దర్శనం టికెట్ చార్జీలు ప్రయాణికులే భరించాలని పేర్కొన్నారు. వివరాలకు 7382847727, 7382850707, 8978383084 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


