గంగాధర: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మద్దతు ధరతో అమ్ముకుందామంటే జరుగుతున్న జాప్యం, అధిక తూకం, మిల్లుకు వెళ్లిన తరువాత మరోసారి కోతలు విధించడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రోడ్డెక్కి రాస్తారోకో చేశారు. వెంకటాయిపల్లి గ్రామానికి చెందిన రైతులు కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు గడుస్తున్నా తూకం వేయడం లేదన్నారు. కేంద్రం ప్రారంభించిన నుంచి ఇప్పటివరకు రెండు లారీలు మాత్రమే తూకం వేశారని అన్నారు. సంచికి 41 కిలోలు మాత్రమే తూకం వేయాల్సి ఉండగా.. 42.200 కిలోల తూకం వేస్తున్నారని, మిల్లుకు వెళ్లిన తరువాత మరో కిలో కోత పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకోతో ఇరువైపులా పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఎస్సై వంశీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కారానికి కృషి చేస్తాననడంతో రైతులు ఆందోళన విరమించారు.
మంగపేట రైతులు..
ధాన్యం తూకం వేయడంలో జాప్యం జరుగుతోందని, కొనుగోలు కేంద్రం వద్ద సౌకర్యాలు కరువయ్యాయని మంగపేట గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించాలని, తూకం వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిలోని మంగపేట స్టేజీ వద్ద ఆందోళన నిర్వహించారు. తహసీల్దార్ రజిత సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


