కరీంనగర్ అర్బన్: తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు పెడితే సహించమని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని, రానున్న 15 రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్షించారు. సమస్య ఎక్కువగా ఉన్న కొనుగోలు కేంద్రం, రైస్ మిల్లుపై ముందుగా దృష్టి సారించాలని తెలిపారు. స్థానిక హమాలీలకు ప్రాధాన్యం ఇస్తూ వారితో మాట్లాడి హమాలీ కొరత పరిష్కరించాలని తెలిపారు. అవసరమైతే నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల నుండి హమాలీలను మాట్లాడుకోవాలని అన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఓఆర్‌ఎస్ ద్రావణం అందించాలని అన్నారు. ధాన్యం రవాణా కోసం మరో 200 అదనపు వాహనాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కొన్న ధాన్యాన్ని మిల్లులు, స్టోరేజీ కేంద్రాలకు తరలించాలన్నారు. రైతులకు చెల్లింపు ప్రక్రియలో ఆలస్యం చేయవద్దని ఆదేశించారు. కలెక్టర్ చిత్ర మిశ్రా మాట్లాడుతూ... రానున్న 15 రోజులు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ధాన్యం రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవోలు కె.మహేశ్వర్, రమేశ్ బాబు, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.రజనీకాంత్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ట్రాన్స్‌పోర్ట్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


