కరీంనగర్ కార్పొరేషన్: నగరాన్ని సుందరంగా మార్చేందుకు అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) స్కీం గొప్ప అవకాశమని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. గురువారం నగరపాలకసంస్థ అత్యవసర సర్వసభ్య సమావేశం మేయర్ శ్రీనివాస్ అధ్యక్షతన కౌన్సిల్ హాల్‌లో జరిగింది. సమావేశంలో నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ యూసీఎఫ్ స్కీంలో ప్రవేశం, కేంద్ర,రాష్ట్ర, నగరపాలక సంస్థ వాటాలు, పనుల అమలుపై సభ్యులకు వివరించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ అర్బన్ చాలేంజ్ ఫండ్ పథకాన్ని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ త్వరలో ప్రకటించనుండడంతో ఈ పథకం లో కరీంనగర్ నగరపాలక సంస్థ ను చేర్చేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.1150 కోట్ల నిధులతో ప్రతిపాదనలు సిద్దం చేసి పంపిస్తున్నామని తెలిపారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సహకారంతో ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు చేపడుతామన్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్ వైద్యుల అంజన్‌కుమార్ మాట్లాడుతూ... యూసీఎఫ్ స్కీం విజయవంతం కావాలంటే మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబుల సహకారం తీసుకోవాలని సూచించారు. ప్రజలకు పాలకవర్గానికి వారధిగా ఉండాల్సిన అధికారులు నిబంధనల సాకుతో ఇబ్బందులు పెడుతున్నారని, ఈ విధానం మార్చుకోవాలన్నారు. అనంతరం రూ.1150 కోట్ల ప్రతిపాదనలను ఆమోదిస్తూ నగరపాలకసంస్థ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సమావేశంలో డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియుద్దీన్, వేణు మాధవ్, ఎస్‌ఈ రాజకుమార్, ఈఈ సంజీవ్ కుమార్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.


