కరీంనగర్ అర్బన్: అన్నదాత సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తామని, రైతులే తమకు తొలి ప్రాధాన్యతని కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య స్పష్టం చేశారు. నూతనంగా నియామకమైన మార్కెట్ పాలకవర్గం శుక్రవారం బాధ్యతలు స్వీకరించింది. వైస్ చైర్మన్‌గా నియమితులైన సుధగొని లక్ష్మీనారాయణగౌడ్ పదవి పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్లుగా పంజాల శ్రీనివాస్, బోనాల శ్రీనివాస్, ఖాజా, రుద్ర రాము, మీసల శంకర్, తాపట్ల రాజు, జగ్గని కనకయ్య, రావణవేని సంపత్, కాశవేణి భూమయ్య, మాలోతు మాలతి, శివనాథుని వెంకటేశ్వర్లు, పల్ల శివకుమార్ బాధ్యతలు స్వీకరించారు.
వైస్ చైర్మన్ విముఖత
కరీంనగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా నియామకమైన సుధగొని లక్ష్మీనారాయణగౌడ్ తనకు ఆ పదవి వద్దని స్పష్టం చేస్తున్నారు. లాబీయింగ్ ద్వారా వెలిచాల రాజేందర్‌రావు తనకు అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు. కాగా, వారం క్రితం లక్ష్మీనారాయణగౌడ్ చైర్మన్‌గా ప్రతిపాదనలు పంపగా మూడు రోజుల క్రితం ఆకుల నర్సయ్య చైర్మన్‌గా మార్కెట్ కమిటీ నుంచి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఆకుల నర్సయ్య వెలిచాల రాజేందర్‌రావు వర్గం కాగా లక్ష్మీనారాయణ మరో వర్గం. ఈ క్రమంలో రాజేందర్‌రావు ప్యానెల్‌కే చైర్మన్ పదవి దక్కగా లక్ష్మీనారాయణకు వైస్ చైర్మన్ ఇవ్వగా ఆయన విముఖత వ్యక్తం చేస్తున్నారు. తన పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు.


