ఉపాధి పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

ఉపాధి పొడిగింపు

May 9 2026 7:50 AM | Updated on May 9 2026 7:50 AM

● మే నెల పాత పద్ధతిలోనే పనులు ● జిల్లాకు 4.76 లక్షల పని దినాలు కేటాయింపు

కరీంనగర్‌రూరల్‌: ఉపాధి హామీ పథకాన్ని మే నెలాఖరు వరకు పొడిగించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకం స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన వీబీ జీరామ్‌జీ పథకం ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభించాల్సి ఉండగా గైడ్‌లైన్స్‌ ఖరారు కాకపోవడంతో పాత విధానాన్నే అమలు చేయాలని నిర్ణయించారు. గత నెలలో ఉపాధి హామీలో చేపట్టిన పనులనే ఈ నెలాఖరువరకు కొనసాగించాలని ఆదేశాలిచ్చారు.

జిల్లాకు 4.76లక్షల పనిదినాలు...

ఉపాధి పథకంలో ప్రతీ గ్రామం నుంచి కనీసం 50 మంది కూలీలకు పనులు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లాకు ఏప్రిల్‌లో మొత్తం 4,59,612 పనిదినాలు కేటాయించగా నెలాఖరు వరకు 2,74,110 పనిదినాలు పూర్తి చేశారు. మే లో 4.76 లక్షలను కేటాయించగా అన్ని గ్రామాల్లో కూలీలు ఎక్కువ సంఖ్యలో పనులకు వచ్చేలా మండలాలకు లక్ష్యాన్ని నిర్దేశించారు. రెండు నెలలకు సంబంధించి మొత్తం 6.92లక్షల పనిదినాలు లక్ష్యం కాగా ఇప్పటివరకు 2.63లక్షల పనిదినాలను పూర్తి చేశారు. కరీంనగర్‌ మండలంలో మొత్తం 42,112 పనిదినాలు లక్ష్యం కేటాయించగా ఇప్పటివరకు 13,592 పనిదినాలు పూర్తిచేసినట్లు ఉపాధి అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు లేకపోవడంతో కూలీలు ఉపాధి పనులకు వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. పంచాయతీల వారీగా కూలీల హాజరు పెంచేందుకు లక్ష్యాలను పెట్టడంతోపాటు ఫీల్డ్‌ అసిస్టెంట్లకు రోజువారీగా నగదు బహుమతులను అందిస్తున్నారు. దీంతో అన్ని గ్రామాల్లో ఉపాధి పనులకు కూలీలు పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement