నగర బంద్‌ విజయవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

నగర బంద్‌ విజయవంతం చేయండి

May 9 2026 7:50 AM | Updated on May 9 2026 7:50 AM

నగర బంద్‌ విజయవంతం చేయండి

కరీంనగర్‌టౌన్‌: దాడులకు ప్రతి దాడులు తప్పవని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హెచ్చరించారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్‌లో మాట్లాడారు. బీజేపీ దాడులకు నిరసనగా శనివారం కరీంనగర్‌ నగర బంద్‌కు ప్రజలతో పాటు వ్యాపార, వాణిజ్య ఇతరాత్ర సంఘాలు మద్దతు తెలిపి జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర హోంమంత్రి హోదాలో ఉండి బండి సంజయ్‌ గూండాలను ప్రోత్సహిస్తే దేశ సైనికులకు ఏ సందేశం ఇస్తారని ప్రశ్నించారు. బీజేపీ లక్ష్యం కేసీఆర్‌, కేటీఆర్‌ను బద్నాం చేయడమే అని విమర్శించారు. ప్రతీ రాజకీయ కార్యక్రమానికి పోలీసులు కరీంనగర్‌ను మరో బిహార్‌లా మార్చాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. సంజయ్‌ వ్యాఖ్యలు దాడి ఘటనను సమర్థించినట్లు ఉన్నాయని, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వ్యాఖ్యలు కూడా అలాగే ఉండటంతో రెండు పార్టీల వైఖరి ఒకటేననే అనుమానం కలుగుతోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ప్రతిపక్షాలపై దాడులు చేయించడం జరుగుతోందని విమర్శించారు. నాయకులు చల్లా హరిశంకర్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి, పొన్నం అనిల్‌కుమార్‌, రుద్ర రాజు, జమీల్‌, ప్రశాంత్‌రెడ్డి, పావనిగౌడ్‌, చిట్టీ రాజేందర్‌రావు, తిరుపతి నాయక్‌, వసంతరావు, ఆరే రవి తదితరులున్నారు.

ప్రజలు సహకరించాలి

కరీంనగర్‌టౌన్‌: ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యం, భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ కరీంనగర్‌ చరిత్రలో ప్రథమంగా తన క్యాంపు కార్యాలయంపై బీజేపీ నాయకులు దాడి చేయడాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తీవ్రంగా ఖండించారు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం తన క్యాంపు కార్యాలయంపై దాడి ఘటనను నిరసిస్తూ శనివారం కరీంనగర్‌ నగర బంద్‌కు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజలు, వ్యాపార వాణిజ్య సంస్థలు బంద్‌కు మద్దతు ఇవ్వాలని, బీఆర్‌ఎస్‌ శ్రేణులందరూ శాంతియుతంగా పాల్గొని సహకరించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement