విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్‌లోని ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి 1 నుంచి 10వతరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎ.భాస్కర్ శుక్రవారం తెలిపారు. రాష్ట్రంలోని అర్హులైన 6 నుంచి 14 ఏళ్లున్న అంధ బాలబాలికలు ప్రవేశానికి అర్హులని, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన వారికి ప్రవేశంలో ప్రాధాన్యముంటుందన్నారు. ఆసక్తి ఉన్నవారు తగిన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9701190127, 9440338424 నంబర్లలో సంప్రదించాలన్నారు.
ఒంటరితనం భరించలేక ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య
గోదావరిఖని: ఒంటరితనం భరించలేక ట్రాన్స్‌జెండర్ అరారి రేవతి(34) గురువారం అర్ధరాత్ధ్రాత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రాంనగర్‌లో నివాసం ఉంటున్న రేవతి పదేళ్ల క్రితం ట్రాన్స్‌జెండర్లలో కలిసిపోయింది. మూడేళ్ల క్రితం సర్జరీ చేయించుకుంది. అప్పటినుంచి యాచన చేస్తూ జీవిస్తోంది. ఈక్రమంలో మద్యానికి బానిసైంది. ఒంటరితనం వేధించడంతో భరించలేక జీవితంపై విరక్తి చెంది మద్యం మత్తులో ఇంట్లోని పైకప్పుకు చున్నీతో ఉరివేసుకుంది. ఆమె అన్న ఆరారి రాజు ఫిర్యాదు మేరకు గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై మనోహర్ కేసు నమోదు చేకున్నారు.
నూకలమర్రిలో వివాహిత..
వేములవాడరూరల్: తల్లిగారింటి నుంచి వచ్చిన కొద్దిసేపటికే వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన వేములవాడ రూరల్ మండలం నూకలమర్రిలో శుక్రవారం విషాదం నింపింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం మెట్లచిట్టాపురం గ్రామానికి చెందిన గుగులోతు దివ్య(26)ను వేములవాడరూరల్ మండలం నూకలమర్రికి చెందిన గుగులోతు వినోద్‌కు ఇచ్చి ఐదేళ్ల క్రితం పెళ్లి చేశారు. భర్త వినోద్ బతుకుదెరువు కోసం 16 నెలల క్రితం గల్ఫ్ దేశం వెళ్లాడు. నూకలమర్రిలో ఉంటున్న దివ్య 15 రోజుల క్రితం తల్లిగారింటికి వెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం ఆమె తండ్రి అత్తగారింటిలో దింపి వెళ్లాడు. ఆయన వెళ్లిన కొద్దిసేపటికే దివ్య తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి మూడేళ్ల కొడుకు ఉన్నాడు. ఎస్సై చల్లా వెంకట్రాజం విచారణ చేపడుతున్నారు. గ్రామంలో పోలీస్ బందోబస్తు చేపట్టారు.
రూ.3.50కోట్లకు వ్యాపారీ కుచ్చుటోపి
వేములవాడఅర్బన్: వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఓ వ్యాపారి రూ.3.50కోట్లకు కుచ్చుటోపీ పెట్టారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో నివసించే ఓ వ్యాపారీ రూ.7.56కోట్ల వరకు అప్పులు చేశారు. ఇందులో రూ.4.77 లక్షల వరకు అప్పు తిరిగి చెల్లించాడు. మిగిలిన రూ.3.51 కోట్లకు ఐపీ పెట్టారు. బాకీ ఇచ్చిన 39 మందికి ఐపీ నోటీసులు పంపారు. వారం రోజులుగా వ్యాపారీ కనిపించడం లేదు. ఈక్రమంలోనే బాకీ ఇచ్చిన వారికి ఐపీ నోటీస్‌లు అందుతుండడం కలకలం రేపింది. పెద్ద మొత్తంలో ఐపీ దాఖలు చేయడంతో వేములవాడలో చర్చనీయాంశంగా మారింది.
నిందితుడి అరెస్ట్
బుగ్గారం: మండలంలో పలు దొంగతనాలకు పాల్పడిన నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. చిన్నాపూర్‌కు చెందిన ఎనగంటి గంగయ్య తన చికెన్ సెంటర్‌లో దొంగతనం జరిగి రూ.12,500 ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదు చేయగా వివిధ ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించి గట్టు రాజేందర్ వ్యక్తి చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. గతంలో బుగ్గారం శివాలయంతో పాటు మరో రెండు దొంగతనాల కేసుల్లో నిందితుడికి ప్రమేయం ఉందని తెలిపారు. రూ.5,800 నగదు స్వాధీనం చేసుకొని అరెస్టు చేశామన్నారు. కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించినట్లు తెలిపారు.


