పంచ్.. కిక్.. కటాస్..స్పారింగ్
ఆత్మవిశ్వాసం.. క్రమశిక్షణ
● పంచ్ పడాల్సిందే..
● ఆత్మరక్షణ విద్యలో శిక్షణ
● వేములవాడలో కరాటేకు క్రేజీ
కరాటే అంటే కళ కాదు. మన శరీరాన్ని, మనసును క్రమశిక్షణగా ఉంచే మార్గం. బాలికలు స్వీయరక్షణకు తప్పకుండా శిక్షణ తీసుకోవాలి. వేసవిలో కరాటే శిక్షణతో స్వీయరక్షణ కలుగుతుంది.
– కె.ఆయుశ్రీ, వేములవాడ
ఈ శిక్షణకు వస్తుండడంతో ఫిట్‌నెస్‌పై అవగాహన కలిగింది. భయపడకుండా బయటకు వెళ్లగలుగుతున్నాను. ఫిట్‌నెస్‌తోపాటు స్టడీలోనూ చాలా ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. ప్రతీ బాలిక తప్పకుండా కరాటే నేర్చుకోవాలి.
– కె.అవంతిక, వేములవాడ
ఆత్మరక్షణ అంటే కేవలం శారీరకంగా పోరాడటం కాదు. అది ఒక మనోభావం. దాడులకు గురికాకుండా ముందుగా అప్రమత్తంగా ఉండే చైతన్యం. ఇప్పటి సమాజంలో బాలికలపై పెరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో వారికి ఆత్మరక్షణ శిక్షణ ఎంతో అవసరం. ఈ శిబిరంలో పాల్గొంటున్న చిన్నారులు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటున్నారు. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– ఎం.ఎ.మన్నాన్, కరాటే మాస్టర్
కరాటే కేవలం ఆట కాదు. కరాటే యోగాలా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. కోచ్ బాగా నేర్పిస్తున్నారు. ఉచితంగా నేర్పించడం బాగుంది. అమ్మాయిలు ఆత్మరక్షణకు ఇలాంటి శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
– పి.శివగౌతమ్, వేములవాడ
సెలవుల్లో ఇంట్లో కూర్చుని బోరు కొట్టకుండా ఈ కరాటే క్లాసులకు వస్తున్నాను. ఇక్కడ పంచ్‌లు, కిక్స్ నేర్చుకోవడం ద్వారా శారీరకంగా బలంగా తయారవుతున్నాను. ఏదైనా ఆపద వస్తే ఎదురించగలననే ధైర్యం కలుగుతుంది. కరాటేతో క్రమశిక్షణతోపాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది.
– బి.క్రాంతికుమార్, వేములవాడ
వేములవాడ: వేసవి సెలవులు వచ్చాయంటే అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లేవాడినని.. సెలవులన్నీ రోజులు ఆటలతోనే గడిచేవని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తన చిన్ననాటి వేసవి సెలవుల ముచ్చట్లు వివరించారు. ఆయన మాటల్లోనే.. రుద్రంగిలోని మా అమ్మమ్మ పుప్పాల మల్లమ్మ–నర్సయ్యల ఇంటి కాడి నుంచి 1971లో బండమీది పెద్దబడిలో చేరాను. స్కూల్‌కు దోస్తు లక్ష్మీనారాయణ, బావ శ్రీనివాస్‌లతో కలిసి వెళ్లేవాడిని. పదో తరగతి వరకు అక్కడే చదువుకున్న. బడి నుంచి రాగానే ఆటలు ఆడుకునేవాళ్లం. ఉశికనూతి బావిలో ఈతకు వెళ్లేవాళ్లం. సోరకాయ బుర్రలతో ఈతనేర్చుకున్నాం. రామకృష్ణాపూర్ వెళ్లే దారిలోని ఒర్రె ఒడ్డున ఉన్న చింతచెట్టుపై కోతికొమ్మ ఆట ఆడుకునేటోళ్లం. మూడుబజార్ల కాడ రాత్రిపూట లైటు కింద దొంగ, పోలీసు ఆడుకునేవాళ్లం. గోటీలు, సిర్రగోనె, తాడు–బొంగురం ఆడేవాళ్లం. ఎండాకాలం వచ్చిందంటే ఆటలతోనే పొద్దుపోయేది. తిండి తినాలని కూడా గుర్తుండేది కాదు. ఆటలతోనే నా బాల్యం ఎంతో ఆనందంగా గడిచిపోయింది.
వేములవాడ: ‘అలర్ట్.. బో..’ అరుపులతో వేములవాడ సినారె కళామందిరం పరిసరాలు మారుమోగుతున్నాయి. పిడికిలి బిగించి పంచ్‌లు ఇవ్వడంలో నైపుణ్యాలు నేర్చుకుంటున్నారు. గాలిలో ఎగురుతూ కిక్స్‌తో చిన్నారులు అదుర్స్ అనిపిస్తున్నారు. ఎలాంటి ఆపద ఎదురైనా తమను తాము రక్షించుకునేందుకు బేసిక్ కరాటేలో ప్రావీణ్యం పొందుతున్నారు. విద్యాసంస్థలకు వేసవి సెలవులు మొదలైనప్పటి నుంచి నిత్యం ఉదయం, సాయంత్రం విద్యార్థినులు కరాటేలో శిక్షణ తీసుకుంటున్నారు. ఇటీవల ఆత్మరక్షణ విద్యపై ఆసక్తి పెరిగింది. బాలికలకు ఆత్మరక్షణ విద్య అవసరమని తల్లిదండ్రులు గుర్తిస్తుండడంతో ఈ శిక్షణకు నిత్యం 50 నుంచి 60 మంది చిన్నారులు హాజరవుతున్నారు. కరాటే మాస్టర్ ఎంఏ మన్నాన్ వీరిని చిచ్చరపిడుగుల్లా తయారు చేసేందుకు కఠినమైన శిక్షణ ఇస్తున్నారు.
సెలవుల్లో ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదని కరాటే ఉచిత శిక్షణను మాస్టర్ మన్నాన్ ప్రారంభించారు. శారీరకంగా బలంగా తయారయ్యేందుకు ఈ విద్య ఎంతగానో దోహడపడుతుందని మాస్టర్ తెలిపారు. శారీరకంగా బలంగా ఉంటే మానసికంగా ధైర్యంగా ఉంటామని.. ఆ సమయంలో ఎలాంటి ఆపద వచ్చిన ఎదుర్కోగలుగుతామంటున్నారు. కరాటేతో క్రమశిక్షణ.. ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాకుండా చదువుల్లో ఏకాగ్రత కూడా పెరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్


