జేసీబీ తగిలి ఒకరి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

జేసీబీ తగిలి ఒకరి దుర్మరణం

May 8 2026 1:25 PM | Updated on May 8 2026 1:25 PM

పెగడపల్లి: వ్యవసాయ భూమి చదును చేస్తుండగా జేసీబీ బకెట్‌ తగిలిన ఓ రైతు మృతి చెందిన ఘటన పెగడపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్‌కుమార్‌ కథనం ప్రకారం.. గొల్లపల్లి మండలం అగ్గిమల్ల గ్రామానికి చెందిన ఎనగందుల రాములు (57)కు పెగడపల్లి మండలం లింగాపూర్‌ శివారులో వ్యవసాయ భూమి ఉంది. జేసీబీతో బండరాళ్లు తొలగిస్తున్న క్రమంలో రాములుకు జేసీబీ బకెట్‌ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు అతడిని జగిత్యాల అసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. డ్రైవర్‌ ఉప్పుల అఖిల్‌ అజాగ్రత్తగా.. నిర్లక్ష్యంగా జేసీబీని నడపడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని, డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని, రాములు భార్య పుష్పలత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు..

ఒకరికి గాయాలు

వీణవంక: వీణవంక మండలం వల్భాపూర్‌ గ్రామ శివారులోని ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. ఒకరికి గాయాలయ్యాయి. గ్రామస్తుల వివరాల ప్రకారం.. జమ్మికుంట మండలం కృష్ణకాలనీలో ఉంటున్న మైస సురేందర్‌(52), మారపెల్లి దేవేందర్‌(50)తోపాటు మరొకరు ద్విచక్ర వాహనంపై చల్లూరు నుంచి జమ్మికుంటకు వెళ్తున్నారు. వల్భాపూర్‌ శివారుకు రాగానే ఎదురుగా వస్తున్న ఎడ్లబండిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మైస సురేందర్‌ అక్కడికక్కడే మృతిచెందగా.. మారపెల్లి దేవేందర్‌ను 108లో జమ్మికుంట ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సురేందర్‌ కరీంనగర్‌లోని ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిసింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ జరుపుతున్నారు. జమ్మికుంట నుంచి వీణవంక వరకు ఫోర్‌లైన్‌ ఉండగా.. ఒకవైపు రైతులు ధాన్యం ఆరబోశారు. ఒక సైడ్‌ నుంచే వాహనాలు వెళ్తున్నాయి. ఈక్రమంలో ఎడ్లబండిని గమనించక ఢీకొనడంతో రెండు ప్రాణాలు గాలిలో కలిశాయి.

కొలనులో పడి యువకుడి మృతి

గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలోని శ్రీవీరాంజనేయస్వామి ఆలయ ఆవరణలోని కొలనులో ప్రమాదవశాత్తు పడిపోయి యువకుడు మృతిచెందాడు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అచ్చనూర్‌కు చెందిన నీరడి వినయ్‌(16) సిద్దిపేటలోని అమ్మమ్మ దగ్గర ఉంటాడు. ఇటీవల హనుమాన్‌ దీక్ష చేపట్టి మల్లారెడ్డిపేటలోని ఆలయ సందర్శనకు మిత్రులతో వచ్చాడు. కొలనులో స్నానం చేస్తుండగా అందులో పడి మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement