కరీంనగర్: పశ్చిమాసియా యుద్ధం మంటలు జిల్లాలోని టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లను తాకాయి. కమర్షియల్ సిలిండర్ల కొరత ఉండడంతో టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నా యి. నిన్న మొన్నటి వరకు చేతినిండా పనితో బిజీ గా ఉన్న వంటమనుషులు, సప్లయర్లు ప్రస్తుతం ప నిలేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. డిమాండ్‌కు, సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో సిలిండర్ల కోసం ఆయా ఏజెన్సీల ముందు జనం క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఉన్న సిలిండర్లు ఖాళీ కావడం, కొత్తగా బుక్ చేసినప్పటికీ సకాలంలో కావడం లేదని ఆరోపిస్తున్నారు.
ముందు జాగ్రత్తతో ముప్పు
జిల్లాలో 5.2 లక్షలకుపైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 80 వేలకుపైగా కమర్షియల్ కనెక్షన్లున్నాయి. ఫిబ్రవరి చివరి నాటికి రోజుకు సగటున 27 వేల రీఫిల్స్ బుకింగ్ అయ్యేవి. ప్రస్తుతం 32వేలకు చేరింది. ఖాళీగా ఉన్న సిలిండర్లను ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నింపి పెట్టుకుంటుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మెజార్టీ టిఫిన్ సెంటర్లు, టీస్టాల్ యజమానులు కమర్షియల్ కనెక్షన్లు తీసుకోకుండా గృహ వినియోగ సిలిండర్లను సేకరించి, రీఫిల్ చేసుకుని వాడుకునేవారు. వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలు పెంచడం, డొమెస్టిక్ సిలిండర్లు ఎవరూ ఇవ్వకపోవడంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు మూసివేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది.
మూతపడుతున్న టిఫిన్ సెంటర్లు
గ్యాస్ కొరతతో కరీంనగర్‌లో బాగా నడిచే ప్రధాన టిఫిన్ సెంటర్లు సోమవారం నుంచి మూతపడ్డాయి. జిల్లాలో 500కు పైగా టిఫిన్ సెంటర్లు, 100కు పైగా హోటళ్లు, రెస్టారెంట్లు ఉండగా మెజార్టీ హోటళ్లలో మెనూలోని ఐటెమ్స్ సగానికి తగ్గించారు. గ్యాస్ ఎక్కువ ఖర్చయ్యే ఆహార పదార్థాలు వండడం మానేశారు. తక్కువ సమయంలో ఉడికే ఆహార పదార్థాలనే రెడీ ఫర్ ఈట్ ప్లేస్‌లో ఉంచుతున్నారు. కొంతమేర కమర్షియల్ సిలిండర్లు పంపిణీ కావడంతో చిన్నటిఫిన్ సెంటర్లు, కర్రీపాయింట్లు, రొట్టెలు తయారీదారులు గ్యాస్‌పైనే వంటలు చేస్తున్నారు.
కరీంనగర్‌లోని బార్లు, రెస్టారెంట్లు, దాబాల్లో మొదటి నుంచి గ్యాస్‌తో పాటు బట్టీలకు తప్పనిసరిగా కట్టెల పొయ్యిలు వాడుతున్నారు. పూర్తిగా గ్యాస్‌పై ఆధారపడినవారు మినహా, మిగతా వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అరకొరగా అందుబాటులో ఉన్నాయి. తక్కువ గ్యాస్ వాడేవారు తమ వ్యాపారులు యథావిధిగా నడుపుతున్నారు.
నగరంలో 50కి పైగా ప్రైవేటు హాస్టళ్లు ఉన్నాయి. ఎక్కడా గ్యాస్ కొరత పెద్దగా కనిపించలేదు. కొంత మంది నిర్వాహకులు గ్యాస్ ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలు వాడుతున్నారు. మరో రెండు మూడు రోజుల్లో కమర్షియల్ గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోతే ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంది.


