కరీంనగర్‌క్రైం: తిమ్మాపూర్ మండల పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి కారు, బంగారు గొలుసు, నగదు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో సీపీ గౌస్‌ఆలం వివరాలు వెల్లడించారు. గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన పెనుగొండ అబినైజర్(19), పంబాల నాగరాజు (19), పెద్దపల్లి జిల్లా బొట్లవనపర్తికి చెందిన గుజ్జేటి మధువర్ధన్ (19), నుస్తులాపూర్‌కు చెందిన మాచర్ల రామ్‌చరణ్ గౌడ్(19), మరో మైనర్ కలిసి జల్సాలకు అలవాటు పడ్డారు. గతంలో వీరు అద్దెకు తీసుకున్న ఎర్టిగా కారు డ్యామేజీ కాగా.. యజమానికి రూ.40,000 వేలు చెల్లించాల్సి ఉంది. ఆ డబ్బుకోసం దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. గుండ్లపల్లికి చెందిన ఆర్‌ఎంపీ తమ్మనవేని కొమురయ్యను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈనెల 11న కరీంనగర్‌లో ఓ కారును అద్దెకు తీసుకున్నారు. రాత్రి 11:30 గంటలకు కొమురయ్య నేదునూర్ నుంచి బైక్‌పై వెళ్తుండగా కారులో వెంబడించారు. గ్రామ శివారులోని మామిడి తోట వద్ద అడ్డగించి, కళ్లలో కారం చల్లారు. ఆయన మెడలోంచి తులం బంగారు గొలుసు, రూ.1,000 చోరీచేసి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం ఇందిరానగర్ వద్ద నిందితులను పట్టుకున్నారు. కోహెడ మండలంలో ఓ కరెంటు మోటారును సైతం దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. వారి నుంచి కారు, బంగారు గొలుసు, నాలుగు సెల్‌ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, తిమ్మాపూర్ సీఐ సదన్‌కుమార్, ఎల్‌ఎండీ ఎస్సై అన్వర్, కానిస్టేబుళ్లు రాఘవ, ఆకాశ్, అనిల్‌ను సీపీ అభినందించారు.


