హసన్‌పర్తి: వ్యవసాయ మోటార్ల చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాల తనిఖీ సందర్భంగా వంగపల్లి వద్ద సీసీఎస్, కమలాపూర్ పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం కమిషనరేట్ కార్యాలయంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ఓదెలలోని తారకరామ కాలనీకి చెందిన సిరిగిరి ప్రసాద్, మంచిర్యాల జిల్లా చున్నంబట్టి కాలనీకి చెందిన మోతె రాజు, గోదావరిఖని ప్రగతినగర్‌కు చెందిన టేకు నవీన్, మంచిర్యాలకు చెందిన వారణాసి లక్ష్మణ్, మంచిర్యాల జిల్లా గాంఽధీనగర్‌కు చెందిన మోటం తిరుపతి, మోటం నరేశ్, మంచిర్యాల జిల్లా భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన వస్తం భీమేశ్ ముఠాగా ఏర్పడ్డారు. మద్యానికి బానిసైన వీరు సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకు వ్యవసాయ బావులు, కాల్వల వద్ద అమర్చిన మోటార్లను అపహరిస్తూ జల్సాలు చేస్తున్నారు. ఈక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిఽధిలోని కమలాపూర్, దామెర పోలీస్‌స్టేషన్లు, భూపాలపల్లి జిల్లా రేగొండ పీఎస్ పరిధిలోని కేశవపట్నంలో మోటార్లు అపహరించారు.
ఫిర్యాదు మేరకు రంగంలోకి..
ఆయా గ్రామాల రైతుల ఫిర్యాదుతో గాలింపు చర్యలు చేపట్టారు. కమలాపూర్ మండలం వంగపల్లి వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఆటోట్రాలీ, కారు అనుమానాస్పదంగా కనిపించింది. అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు అంగీకరించారు. ఏడుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 71 వ్యవసాయ మోటార్లు స్వాధీనం చేసుకుని ఆటోట్రాలీ, కారు సీజ్‌చేసినట్లు డీసీపీ వెల్లడించారు. నిందితులకు నేర చరిత్ర ఉందని డీసీపీ చెప్పారు.కరీంనగర్, రామగుండం కమిషనరేట్ పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్లనుఽ ధ్వంసం చేసి కాపర్ వైర్‌ను అపహరించిన కేసుల్లో నిందితులు జైలుకెళ్లారని డీసీపీ తెలిపారు.
71 వ్యవసాయ మోటార్లు స్వాధీనం
ఆటో ట్రాలీ, కారు సీజ్


