నిజాయితీ చాటుకున్న భీమన్న ఆలయ స్వీపర్‌ | - | Sakshi
Sakshi News home page

నిజాయితీ చాటుకున్న భీమన్న ఆలయ స్వీపర్‌

Mar 10 2026 12:52 PM | Updated on Mar 10 2026 12:52 PM

4 తులాల బంగారు బ్రేస్‌లెట్‌ అప్పగింత

వేములవాడ: భీమన్న ఆలయంలో సోమవారం వరంగల్‌ జిల్లా లింగాలఘనపురం మండలం కుందారం గ్రామానికి చెందిన రేసు సతీశ్‌ తన చేతికున్న 4 తులాల బంగారు బ్రేస్‌లెట్‌ను పోగొట్టుకున్నారు. అక్కడే స్వీపర్‌గా విధులు నిర్వహిస్తున్న డప్పు నాగమణికి ఇది దొరికింది. ఆమె నిజాయితీగా వచ్చి ఆలయ అధికారులకు అప్పగించారు. దీంతో ఆలయ అధికారులు మైక్‌ ద్వారా ప్రకటించడంతో దాని ఆనవాళ్లు చెప్పిన తర్వాత సతీశ్‌కు అప్పగించారు. ఔట్‌సోర్సింగ్‌లో స్వీపర్‌ ఉద్యోగం చేస్తున్న నాగమణి తనకు దొరికిన బంగారు బ్రేస్‌లెట్‌ను నిజాయితీగా అప్పగించడంతో ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మ, ఎస్పీఎఫ్‌ సిబ్బంది అభినందించారు.

పోక్సో కేసులో 13ఏళ్ల జైలు, జరిమానా

గోదావరిఖనిటౌన్‌: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన మంథని కిరణ్‌ ఉరఫ్‌ నిఖిల్‌కు 13ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.13వేల జరిమానా విధిస్తూ పెద్దపల్లి ఫాస్ట్‌ట్రాక్‌ స్పెషల్‌ జడ్జి స్వప్నరాణి మంగళవారం తీర్పు వెలువరించారు. వివరాలు.. కిరణ్‌ 2018లో తన అన్నకూతురును ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించడంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని గోదావరిఖని వన్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి స్టేషన్‌హౌస్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సీఐ రమేశ్‌ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. నేరం రుజువుకావడంతో మంథని కిరణ్‌కు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. బాధితురాలు కుటుంబానికి రూ.2లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డొంకేన రవీందర్‌ సాక్షులను ప్రవేశపెట్టారు. పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ రమేశ్‌ పర్యవేక్షణలో సాక్షులను ప్రవేశ పెట్టడానికి సహకరించిన టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి, కోర్టు కానిస్టేబుళ్ల సతీశ్‌, కోటేశ్వరరావును రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement