కన్నీటి కష్టాలు తప్పవా?
పడిపోతున్న ఎల్‌ఎండీ నీటిమట్టం వేసవి గట్టెక్కడంపై బల్దియా ఆందోళన రేపటి నుంచి రోజు విడిచి రోజు సరఫరా? మిడ్‌మానేరు నుంచి 13 టీఎంసీలు వస్తేనే ఊరట
కరీంనగర్ కార్పొరేషన్: వేసవి ప్రారంభంలోనే నగరంలో తాగునీటికి తిప్పలు మొదలయ్యాయి. సిటీలో ప్రతి రోజు తాగునీటి సరఫరా జరగాల్సి ఉండగా, ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రోజు విడిచి రోజు సరఫరా జరుగుతోంది. తాగునీటి సరఫరాకు ఏకై క వనరైన ఎల్‌ఎండీలో క్రమేపీ నీటిమట్టం తగ్గుతుండడంతో, బుధవారం నుంచి నగరమంతా రోజు విడిచి రోజుకు నీటి సరఫరా మారనుంది. తాగునీటి ముప్పు ముంచుకువస్తుండడంతో, ఈ వేసవి గట్టెక్కడంపై బల్దియా అధికారులు కుస్తీపడుతున్నారు.
మిడ్‌మానేరు నుంచి 13 టీఎంసీలు వస్తేనే
తగ్గుతున్న ఎల్‌ఎండీ నీటిమట్టం నగరంలో తాగునీటి సరఫరాకు ప్రమాదఘంటికలను మోగిస్తోంది. ఫిబ్రవరిలోనే ఏడు టీఎంసీలకు పడిపోతే, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి మరింత అధ్వానంగా మారే అవకాశముంది. మిడ్‌మానేరులో సరిపడా నీటి లభ్యత ఉన్నందున, ఎల్‌ఎండీకి ఇన్‌ఫ్లోను పెంచాల్సి ఉంది. మిడ్‌మానేరు నుంచి 13 టీఎంసీల నీళ్లు ఎల్‌ఎండీకి విడుదల చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఔట్‌ఫ్లోకు, ఇన్‌ఫ్లోకు 2500 క్యూసెక్కుల తేడా ఉండడంతో, ఈ తేడాను పూడ్చేందుకు అదనంగా 2,500 క్యూసెక్కులు మిడ్‌మానేరు నుంచి ఎల్‌ఎండీకి విడుదల చేయాల్సి ఉంది. అప్పుడు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4,500 క్యూసెక్కులుగా ఉండడంతో, ఇప్పుడున్న ప్రకారం 7 టీఎంసీల నీటి నిలువ తగ్గకుండా ఉంటుంది.
ముందస్తు ప్రణాళిక సిద్ధం
వేసవిలో తాగునీటి సమస్యను ఎదుర్కొనేందుకు రూ.49 లక్షలతో నగరపాలకసంస్థ ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసింది. వీటితో అవసరమైన చోట మరమ్మతులు చేయడం, విలీన ప్రాంతాల్లో బావులను అద్దెకు తీసుకొని,పైప్‌లైన్‌ల ద్వారా నీటిని సరఫరా చేయనున్నారు.
7 టీఎంసీలకు నీటిమట్టం
నగరంలో తాగునీటి సరఫరాకు ఏకై న వనరైన ఎల్‌ఎండీ నీటిమట్టం క్రమేపీ తగ్గుతుండడం ఆందోళనకరంగా మారింది. సాధారణంగా ఎల్‌ఎండీలో 10 టీఎంసీల నీళ్లు నిలువ ఉంటే, నగరవ్యాప్తంగా ఆటంకం లేకుండా తాగునీటి సరఫరా జరుగుతుంది. వేసవి మొదట్లో అంటే ఫిబ్రవరి నెలలోనే నీటి మట్టం 7.7 టీఎంసీలకు పడిపోయింది. పైగా ఎల్‌ఎండీ ఔట్‌ఫ్లో 4,500 క్యూసెక్కులు ఉండగా, ఇన్‌ఫ్లో కేవలం 2,000 క్యూసెక్కులు ఉంది. దీంతో నీటిమట్టం వేగంగా తగ్గుతోంది. ఎల్‌ఎండీ నీటిమట్టం 5 టీఎంసీలకు తగ్గితే, బూస్టర్‌లతో కూడా నీటిసరఫరాకు ఇబ్బంది ఏర్పడుతుంది. అప్పుడు అసాధారణంగా డ్యాం లోపలి నుంచి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది.
నగరంలో తాగునీటి సరఫరా వివరాలు
వాటర్ ట్యాంక్‌లు 17(1000కేఎల్)
నిర్మాణంలో ఉన్న ట్యాంకులు: 07 (అమృత్ పథకంలో భాగంగా)
13 విలీన గ్రామాల్లో ట్యాంక్‌లు: 63 (1000 కేఎల్ సామర్థ్యం లోపు)
తాగునీటి సరఫరా ప్రస్తుత పరిస్థితి: కొన్ని ప్రాంతాల్లో ప్రతి రోజు, మరికొన్ని ప్రాంతాల్లో రోజు విడిచి రోజు
ఎల్‌ఎండీ నీటిమట్టం 7.7 టీఎంసీలు
ఔట్‌ఫ్లో 4500 క్యూసెక్కులు
ఇన్‌ఫ్లో 2000 క్యూసెక్కులు
కన్నీటి కష్టాలు తప్పవా?


