చిన్నచూపు | - | Sakshi
Sakshi News home page

చిన్నచూపు

Feb 21 2026 7:03 AM | Updated on Feb 21 2026 7:03 AM

చిన్నచూపు

చిన్నచూపు

‘సంక్షేమ’ విద్యార్థులపై

వసతి గృహాల్లో కనిపించని ప్రత్యేక తరగతులు

పదో తరగతి విద్యార్థులకు అందని వార్షిక పరీక్షల మెటీరియల్‌

కరీంనగర్‌టౌన్‌: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోంది. పదో తరగతి పరీక్షల విషయంలో ఉన్న భయం, ఇతర సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక తరగతుల ఊసే కనిపించడం లేదు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాల్సి ఉండగా ఇప్పటికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖలు ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదు. దీంతో పరీక్షల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమశాఖలకు సంబంధించి జిల్లాలో 35 వసతి గృహాలు ఉండగా 250 మందికిపైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికి మార్చి 14 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానుండగా కేవలం ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మాత్రమే స్పెషల్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఎస్సీ వసతి గృహాల్లో ఉన్నవారికి ఇప్పటికే మెటీరియల్‌ అందించారు. బీసీ, ఎస్టీ వసతి గృహాల విద్యార్థులకు స్పెషల్‌ క్లాసులు, మెటీరియల్‌ విషయంలో ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పరీక్షలకు ఇంకా 20 రోజులు మాత్రమే గడువు ఉండగా స్పెషల్‌ కాసుల నిర్వహణ, స్డడీ మెటీరియల్‌ అందించడం వంటి విషయాల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

35 వసతి గృహాలు.. 250 మందికి పైగా విద్యార్థులు

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమశాఖల ఆధ్వర్యంలో 35 వసతి గృహాలు ఉండగా 250 మందికిపైగా విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నారు. వీరంతా పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కేవలం ఎస్సీ వసతి గృహాల్లో మాత్రమే విద్యార్థులకు మెటీరియల్‌ అందజేశారు. మెటీరియల్‌ డిసెంబరులోనే అందించాల్సి ఉండగా ఆలస్యంగా రావడంతో జనవరి చివరి వారంలో అందించారు. ఎస్టీ, బీసీ వసతి గృహాల విద్యార్థులకు మాత్రం మెటీరియల్‌ అందించలేదు. ఈ విషయమై అధికారులను సంప్రదించగా.. మెటీరియల్‌కు సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. స్థానికంగా ఆర్థిక వనరులను సమకూర్చుకుని ఉన్న బడ్జెట్‌లో మెటీరియల్‌ అందించాల్సి ఉంది. కానీ అధికారులు చొరవచూపక విద్యార్థులు నష్టపోతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవచూపి స్టడీ మెటిరియల్‌ అందించడంతో పాటు ట్యూటర్లను నియమించి ప్రత్యేక తరగతుల నిర్వహణకు తగు ఆదేశాలు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement