ఒగ్గు కళాకారుడికి పెద్ద కష్టం
● కిడ్నీలు ఫెయిలై మంచానికే పరిమితం
● దాతలు ఆదుకుంటేనే మళ్లీ మామూలు స్థితికి
● సాయం కోసం పేద కుటుంబం ఎదురుచూపు
గొల్లపల్లి: తెలంగాణ సంస్కృతిని తన గొంతుతో లోకానికి చాటిన ఒగ్గు కళాకారుడు నేడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. గజ్జెల సప్పుడు, డోలు దరువుతో ఊరూరా శివమెత్తి.. జాతీయస్థాయిలో తన ప్రతిభను చాటిన అతడి కాళ్లు నేడు గడప దాటలేకపోతున్నాయి. రెండు కిడ్నీలు ఫెయిలై.. డయాలసిస్‌తో కాలం వెళ్లదీస్తున్నాడు. కిడ్ని మార్పిడికి రూ.లక్షలు అవసరమని వైద్యులు చెబుతుండంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. దాతలు మానవత్వంతో ముందుకొచ్చి ఆదుకోవాలని వేడుకుంటోంది. గొల్లపల్లి మండలం ఆత్మకూర్ గ్రామానికి చెందిన దీకొండ పర్వతాలు ఒగ్గు కళాకారుడు. ఆయనకు భార్య, ఇద్దరు కూతళ్లు ఉన్నారు. జానపద కళను నమ్ముకున్న ఆయన ఒగ్గు కథలు చెబుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. 30ఏళ్లపాటు ఒగ్గు కళను నమ్ముకుని అనేక దేవతల కథలను ప్రజలకు చేరువ చేశాడు. అలాంటి ఆయన రెండు కిడ్నీలు ఏడేళ్ల క్రితం ఫెయిల్ కావడంతో ఆయన జీవితం ఒక్కసారిగా చీకటిమయమైంది.
దీనస్థితిలో కుటుంబం
కిడ్నీలు ఫెయిల్ అయిన ఆయన ఉన్న ఎకరం భూమి విక్రయించి కూతుళ్లకు పెళ్లి చేశాడు. తన ఆరోగ్యం మెరుగుకు కోసం రూ.10 లక్షలవరకు అప్పు చేశాడు. అయినప్పటికీ జబ్బు నయం కావడం లేదు. ప్రస్తుతం వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం మందుల ఖర్చులు, ఇల్లు గడిచేందుకూ ఇబ్బంది పడుతున్నాడు.
సాయం కోసం ఎదురుచూపు
దాతలు ముందుకొచ్చి ఆయనను ఆదుకోవాలని ఆ కుటుంబం దీనంగా వేడుకుంటోంది. ఆ గొంతు మళ్లీ పలకాలన్నా.. డోలు దరువు మళ్లీ వినిపించాలన్నా.. మానవతావాదులు ఇచ్చే సాయమే ఆధారమని కన్నీటితో విలపిస్తున్నారు. ఇల్లు పూటగడవడమే కష్టంగా ఉన్న తరుణంలో లక్షలు ఖర్చు పెట్టి కిడ్నీ మార్పిడి చేయించే స్థోమత లేదని, ప్రభుత్వం, మానవతావాదులు, ఎవరైనా కిడ్నీ దాతలు ముందుకొచ్చి ప్రాణభిక్ష పెట్టాలని కోరుతున్నారు. రాష్ట్ర సాధనలో వేలాది ప్రదర్శనలు ఇచ్చానని, ఎక్కడా చేయి చాచలేదని, ఇప్పుడు చాచే దుస్థితి వచ్చిందని పర్వతాలు దీనంగా వేడుకుంటున్నాడు. సాయం చేయాలనుకునే దాతలు, మానవతావాదులు తన ఫోన్‌నంబర్ 96403 65134లో సంప్రదించాలని కోరుతున్నాడు.
ఒగ్గు కళాకారుడికి పెద్ద కష్టం


