అత్తారింటికి వెళ్లి అనంతలోకాలకు..
మంథనిరూరల్: మేడారం మహాజాతర నేపథ్యంలో సమ్మక్క – సారలమ్మ పండుగ కోసం అత్తగారింటికి వెళ్లిన ఓ యువకుడు అనంతలోకాలకు వెళ్లిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మంథని మండడలం ధర్మారం – గద్దలపల్లి గ్రామానికి చెందిన రాయినేని దేవేందర్(32) సిరిపురంలోని అత్తగారింటికి కుటుంబసమేతంగా వెళ్లారు. ఓ పనినిమిత్తం సిరిపురం నుంచి మంథనికి తన ద్విచక్రవాహనంపై వస్తున్న క్రమంలో సిరిపురం రహదారిలో ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం ఢీకోట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలైన దేవేందర్‌ను కుటుంబసభ్యులు గోదావరిఖని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పండుగ కోసం అత్తగారింటికి వెళ్లిన దేవేందర్ రోడ్డు ప్రమాదంలో కానరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబసభ్యులు కన్నీటిపర్వంతమయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య శృతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి


