దొంగలను శిక్షించాలని నిరసన
జగిత్యాలరూరల్: విద్యుత్‌మోటార్లు, వైర్లు ఎత్తుకెళ్తున్న దొంగలను కఠినంగా శిక్షించాలని శుక్రవారం జగిత్యాల పట్టణ శివారులోని ఉప్పరిపేట, రూరల్ మండలం చల్‌గల్, అర్బన్ మండలం హస్నాబాద్, అంబారిపేట గ్రామాల్లోని రైతులు పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కొద్దిరోజులుగా వ్యవసాయ బావుల వద్దనున్న మోటర్లు, విద్యుత్ వైర్లను దొంగలు ఎత్తుకెళ్తున్నారు. దీంతో గురువారం రాత్రి రైతులు పొలాల వద్ద కాపలా ఉన్నారు. ఈక్రమంలో కొంత మంది దొంగలు విద్యుత్ మోటరుతో పాటు, సర్వీస్ వైర్లను దొంగిలించడంతో రైతులు వెంబడించి లింగంపేట రైల్వేస్టేషన్ సమీపంలో పట్టుకుని పట్టణ పోలీసులకు అప్పగించారు. శుక్రవారం మధ్యాహ్నం దొంగల ఇళ్లలో పరిశీలించగా భారీ ఎత్తున సర్వీస్ వైర్లు పట్టుబడ్డాయి. దీంతో పాటు, మరికొంత మంది దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


