డేరాల తొలగింపు వివాదాస్పదం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లిలో ప్రభుత్వ భూమిలో డేరాల తొలగింపు వివాదాస్పదంగా మారింది. బాలసంతుల సామాజిక వర్గానికి చెందిన ఐదు కుటుంబాలు గత 15 ఏళ్లకు పైగా ప్రభుత్వ భూమిలో తాత్కాలికంగా డేరాలు వేసుకుని ఉంటున్నారు. వ్యవసాయ కూలీలుగా ఉపాధి పొందుతున్నారు. జనవరి 5న జరిగిన గ్రామసభలో గ్రామపెద్దలను కలిసి తాము నివసించడానికి డేరాలు వేసుకుంటామని విజ్ఞప్తి చేయగా, గ్రామంలోని సర్వే నంబర్ 79లోని 10 ఎకరాల ప్రభుత్వ భూమిలో అనుమతించారు. బాలసంతుల కులానికి చెందిన సాయిలు, ఎల్లయ్య, నాగరాజు డేరాలు వేసుకోగా.. రాజేశం, అశోక్ శుక్రవారం డేరాలు వేసుకోవడానికి ప్రయత్నించారు. ఈక్రమంలోనే పోతిరెడ్డిపల్లికి చెందిన ఓ కుటుంబం వారిపై దాడికి యత్నించి, డేరాలను ధ్వంసం చేశారు. అదే సమయంలో తినడానికి వండుకుంటున్న అన్నంలో మట్టికొట్టి విధ్వంసం సృష్టించారని వారిపై బహిరంగ విచారణ చేపట్టి చట్టపరంగా శిక్షించాలని జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. ఈ సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేశారు. కబ్జాకు గురైనా భూములపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సుజాత తెలిపారు. కాగా బాలసంతుల కులస్తులు మాట్లాడుతూ గత పదిహేనేళ్లుగా నివాసమై ఉంటున్న గుంటెడు జాగలేని తమకు నివాస స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నారు. తమను ఓట్ల కోసం కాకుండా కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
పోతిరెడ్డిపల్లిలో తొలగించిన రెవెన్యూ అధికారులు
ఆందోళనకు దిగిన బాలసంతుల కులస్తులు
డేరాల తొలగింపు వివాదాస్పదం


