ఆర్టీసీకి మహా‘లక్ష్మి’ శోభ
ఓఆర్‌శాతం పెరిగింది
కరీంనగర్‌టౌన్: రెండేళ్ల క్రితం ఆర్టీసీ బస్టాండ్లలోని ప్లాట్‌ఫామ్ వద్ద డ్రైవర్లు, కండక్టర్లు పోటీ పడి తమ బస్సు నింపుకునేందుకు ప్రయత్నించే వారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. బస్సు డ్రైవర్, కండక్టర్లు ఎవరినీ పిలవాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్లాట్‌ఫామ్ వద్దకు బస్సు రావడమే ఆలస్యం... కిక్కిరిసి బస్సు ఎక్కుతున్నారు. 9 డిసెంబర్ 2023 నుంచి అమలైన మహాలక్ష్మి పథకంతో బస్టాండ్లు, బస్సులు మహిళలతో కిటకిటలాడుతున్నాయి.
85శాతం ఆక్యూపెన్సీ
గతంలో బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య 70శాతానికి మించలేదు. సంస్థకు లాభాలేమో కానీ.. డీజిల్ ఖర్చు, డిపోల నిర్వహణ, సిబ్బంది జీత భత్యాలు సర్దుబాటు కావడమే కష్టమయ్యేది. డిసెంబరు 9 నుంచి పరిస్థితి మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహాలక్ష్మి పథకంతో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అప్పటినుంచి అక్యూపెన్సీ 85శాతం దాటింది. కండక్టర్లు, డ్రైవర్లు ప్రయాణికుల కోసం ఎదురుచూడాల్చిన పనిలేకుండా పోయింది. బస్సుల్లో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పిస్తున్నప్పటికీ, వారి పేరిట డబ్బులు ఆర్టీసీకి చెల్లిస్తోంది. దీంతో సంస్థ ఆదాయం కూడా పెరుగుతోంది.
21.96 కోట్ల మంది ప్రయాణం
కరీంనగర్ ఆర్టీసీ రీజియన్‌లోని 11 డిపోల పరిధిలో రెండేళ్లలో 21.96 కోట్ల మంది మహిళలు వివిధ ప్రాంతాలకు ప్రయాణించారు. రూ.895.82 కోట్ల ఆదాయం సమకూరింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, కొండగట్టు. ధర్మపురి ఆలయాలతో పాటు ఓదెల మల్లికార్జునస్వామి, ఇతర ఆలయాలకు సైతం భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఉచిత ప్రయాణంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు రాకపోకలకు అయ్యే ఖర్చు మిగులుతోంది. గ్రామాల నుంచి పట్టణాల్లో ఉండే పాఠశాలలు, కళాశాలల్లో విద్యాభ్యాసం చేసేందుకు బస్సుపాసులపై వెళ్లే బాలికల కుటుంబాలకు నెలకు రూ.4000 వరకు ఆదా అవుతోంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ కల్పించడంతో పట్టణ ప్రాంతాల్లో వ్యాపారం పెరుగుతోంది. ఉదయం, సాయంత్రం గ్రామాలకు వెళ్లే బస్సులు కిక్కిరిసిపోతున్నాయి.
రెండేళ్లలో రీజియన్ పరిధి వివరాలు
ఎక్స్‌ప్రెస్‌లు : 261
పల్లె వెలుగులు: 448
మహాలక్ష్మి ప్రయాణికులు: 21.96 కోట్లు
ఆదాయం : రూ. 895.82 కోట్లు
65 నుంచి 85శాతానికి పెరిగిన ఆక్యూపెన్సీ
పట్టణాల్లో పెరిగిన వ్యాపారాలు
ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో 70లోపు ఉన్న ఓఆర్ 85శాతానికి పెరిగింది. గతంలో పండుగల సందర్భంగా బస్టాండ్లు కిటకిటలాడేవి. ఇప్పుడు ప్రతిరోజు బస్టాండు్‌ల్ రద్దీగా ఉంటున్నాయి. మహిళలు తప్పనిసరిగా ఒరిజనల్ ఆధార్ కార్డు చూపిస్తే ఉచిత ప్రయాణం కల్పిస్తారు. రద్దీ ఉండే రూట్లలో కొన్ని బస్సులను మళ్లిస్తున్నాం.
– బి.రాజు, ఆర్టీసీ ఆర్‌ఎం
ఆర్టీసీకి మహా‘లక్ష్మి’ శోభ


