ఏ డివిజన్‌కు వెళ్దాం!
కరీంనగర్ కార్పొరేషన్: అప్పటివరకు ఆ డివిజన్‌లో పోటీ చేసేందుకు సమాయత్తమయ్యారు. పాత డివిజనే కాబట్టి గెలుపు సునాయాసమే అనుకున్నారు. మేయర్ పీఠం బీసీ జనరల్‌కు రిజర్వ్ అయిందనగానే ఇంకా సంబరపడ్డారు. ఇక డివిజన్‌లో కార్పొరేటర్‌గా గెలవడమే తరువాయి అనుకున్నారు. రిజర్వేషన్లు తేలేసరికి జాతకాలు తారుమారయ్యాయి. తమ డివిజన్లు మహిళలకు రిజర్వ్ కావడంతో కొందరు ఖంగుతిన్నారు. ఓ వైపు బీసీ జనరల్ అయిన మేయర్ పదవి ఊరిస్తుంటే.. విధిలేక అవకాశం ఉన్న సమీప డివిజన్లపై రిజర్వేషన్ వచ్చిన ఆశావహులు నజర్ పెట్టారు.
రిజర్వేషన్లతో తలకిందులు
కరీంనగర్ నగరపాలకసంస్థ మేయర్ పీఠంపై కన్నేసిన నేతలకు డివిజన్ల రిజర్వేషన్లు తలనొప్పి తెచ్చిపెట్టాయి. పాలకవర్గం పదవీకాలం ముగిసిన ఏడాదికాలం నుంచి మేయర్ రేసులో ఫలానా నేతలున్నారనే ప్రచారాన్ని వారంతా సజీవంగా ఉంచుకుంటూ వస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌ల నుంచి బహిరంగంగా ప్రకటించనప్పటికీ, ఆయా పార్టీల నుంచి ఎవరు రేసులో ఉన్నారో శ్రేణులు చర్చిస్తూ వచ్చారు. తాజాగా మేయర్ పీఠం బీసీ జనరల్‌కు కేటాయించడంతో పోటీ కాస్త తగ్గింది. ఒక్కసారిగా బీసీ నేతలు తెరపైకి వచ్చారు. మేయర్ పీఠం అనుకూలంగా వచ్చినప్పటికీ, తాము పోటీచేసే డివిజన్లు అనుకూలంగా లేకపోవడం ఇప్పుడు వారికి సమస్యగా మారింది. తమ పాత డివిజన్లు మహిళలు రిజర్వ్ కావడంతో స్వయంగా పోటీచేసే అవకాశం లేకుండా పోయింది. తమ భార్యలను పోటీచేసి మేయర్ రేసులో ఉంచడం సెకండ్ ఆప్షన్ కాగా, తామే బరిలోకి దిగి మేయర్ పదవిని సొంతం చేసుకొనే దిశగా పావులు కదుపుతున్నారు.
బీసీ జనరల్ సీట్లకు డిమాండ్
మేయర్ బీసీకి రిజర్వు కావడంతో నుంచి డిమాండ్ పెరిగింది. తమ డివిజన్లు మహిళలకు రిజర్వ్ కావడంతో, సమీపంలో ఉన్న జనరల్ డివిజన్ల నుంచి పోటీచేసేందుకు సన్నహాలు ప్రారంభించారు. బీజేపీ నుంచి మేయర్ రేసులో ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్ తన 55వ డివిజన్ మహిళకు రిజర్వ్ కావడంతో మరో డివిజన్‌పై దృష్టిపెట్టారు. 14వ డివిజన్‌గా మారిన తన స్వగ్రామమైన చింతకుంట నుంచి పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. బీఆర్‌ఎస్ నుంచి మేయర్ రేసులో ఉన్న ఆ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, తన 47వ డివిజన్ మహిళకు రిజర్వ్ కావడంతో, పక్కనే ఉన్న బీసీ జనరల్ సీటు 46వ డివిజన్ నుంచి పోటీకి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి మేయర్ సీటును ఆశిస్తున్న మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ కూడా తన 47వ డివిజన్ మహిళకు రిజర్వ్ కావడంతో 46వ డివిజన్ వైపు మొగ్గుచూపుతున్నారు. వీరితో పాటు తమ డివిజన్లు బీసీ, ఎస్సీ కావడంతో మాజీ కార్పొరేటర్లు సమీప డివిజన్లను వెతుక్కుంటున్నారు. ఇదిలాఉంటే మాజీ కార్పొరేటర్లు, పార్టీ సీనియర్లు తమ డివిజన్లలో పోటీచేసేందుకు సన్నహాలు చేస్తుండడం, ఆ డివిజన్ ఆశావహులకు మింగుడుపడడం లేదు. కొంతమంది మాజీ కార్పొరేటర్లు, మేయర్ రేసులో ఉండే నాయకుల డివిజన్లు అనుకూలించకపోతే, సమీప డివిజన్‌లలో పోటీచేయించేందుకు ఆయా పార్టీ పెద్దలు కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా రిజర్వేషన్‌లతో తారుమారైన తమ రాజకీయ భవిష్యత్‌ను పక్క డివిజన్లలో వెతుక్కొనేందుకు నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.
ఏ డివిజన్‌కు వెళ్దాం!


