‘పది’ విద్యార్థులకు అల్పాహారం
కరీంనగర్‌టౌన్: పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నవారికి అల్పాహారం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. గతంలో విద్యార్థులు ఆకలితోనే ప్రత్యేక తరగతులకు హాజరయ్యేవారు. పట్టణాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రాజకీయ నాయకులు అల్పాహారం అందించేవారు. ప్రభుత్వ పక్షాన ప్రత్యేకంగా నిధుల కేటాయింపులు లేకపోవడంతో మెజార్టీ విద్యార్థులు ఆకలితోనే చదువులను కొనసాగించేవారు. ఎట్టకేలకు వీరి ఆకలి కష్టాలకు తెర పడింది. ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ ఆయా జిల్లాల డీఈవోలకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 19 నుంచి మార్చి 10 వరకు అల్పాహారం అందించనున్నారు.
3,177 మందికి లబ్ధి
ఉత్తీర్ణత శాతం పెంపే లక్ష్యంగా జిల్లాలో 137 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 1 నుంచి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తూ తరగతులు, రివిజన్ టెస్టులు పెట్టారు. ఉదయం 8.30–9.30 గంటల వరకు, సాయంత్రం 4.30–5.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. కాగా, ఐదారు కి.మీ దూరం నుంచి వచ్చే విద్యార్థులు ఉదయం టిఫిన్ చేయకుండా వస్తున్నారు. వారు మధ్యాహ్న భోజనం వరకు వేచి ఉంటున్నారు. మధ్యాహ్నం తిన్న విద్యార్థులు రాత్రి 6.30 – 7 గంటల వరకు ఆహారం తీసుకునే పరిస్థితి లేదు. దీంతో వారిలో అలసట, నీరసం చేరి చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం అల్పాహారం అందించాలని నిర్ణయించడం ఊరట కలిగించే అంశం.
ఒక్కో విద్యార్థికి..
గతంలో ప్రత్యేక తరగతులకు కలెక్టర్ల చొరవతో అల్పాహారం అందించారు. ఈసారి ప్రభుత్వమే నేరుగా నిధులు విడుదల చేసింది. ఒక్కో విద్యార్థికి నిత్యం రూ.15 చొప్పున ఖర్చు చేయనున్నారు. జిల్లాలో పదో తరగతి విద్యార్థులు 3,177 మంది ఉన్నారు. వీరికి గాను రూ.9,05,445 నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మధ్యాహ్న భోజనం నిర్వాహకులతో ఉదయం, సాయంత్రం అల్పాహారం అందేలా చర్యలు తీసుకోనున్నారు.
జిల్లాలో..
హైస్కూళ్లు 137
‘పది’ విద్యార్థులు 3,177
విడుదలైన నిధులు రూ.9,05,445


