హెచ్‌ఐవీని అంతం చేద్దాం
కరీంనగర్: ప్రపంచ ఎయిడ్స్ డేను పురస్కరించుకొని సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని కలెక్టర్ పమేలా సత్పతి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ వైద్యారోగ్యశాఖ కార్యాలయం నుంచి కలెక్టరేట్ మీదుగా ఫిలిం భవన్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఫిలింభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకట రమణ మాట్లాడారు. హెచ్‌ఐవీని అంతం చేద్దామని, దేశంలో రోజురోజుకు తగ్గుముఖం పడుతుందన్నారు. వ్యాధి నివారణకు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధా, డీటీసీవో రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఐఎంఏ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో హెచ్‌ఐవీపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జ్యోతిబాఫూలే పార్కు నుంచి తెలంగాణ చౌరస్తా, ప్రతిమ మల్టిప్లెక్స్ సర్కిల్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ రమణాచారి, అధ్యక్షురాలు డాక్టర్ అకుల శైలజ, కార్యదర్శి మహేశ్ మాట్లాడుతూ, బాధిత కుటుంబాలు ఇప్పటికీ సమాజంలో వివక్ష ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాధి గుర్తింపు, చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఆర్‌టీ సేవలను వినియోగించుకోవాలన్నారు. సీవీఎం చైర్మన్ డాక్టర్ చాట్ల శ్రీధర్, వైద్యులు అంజిబాబు, రమేశ్ కొల్లూరి, శివకుమార్, సునీల్‌రెడ్డి, జ్యోతి, గీతారెడ్డి, రవికాంత్, సాయికృష్ణ, ఆడెపు శైలజ తదితరులు పాల్గొన్నారు. కాగా, జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆర్‌ఎంవో నవీన ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. వైద్యులు షాహాన, ఉదయ్, శ్రీలత, దీప్తి, ఎషికాశ్రీ, ఐసీటీసీ కౌన్సిలర్ సదానందచారి, శ్యాంసుందర్, రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


