నిబంధనల ‘పంచాయితీ’
కులం సర్టిఫికెట్, బ్యాంకుఖాతాతో ఇబ్బంది
ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్‌తో అభ్యర్థుల ఆందోళన
నామినేషన్ దాఖలుకు తిప్పలు
కరీంనగర్‌రూరల్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలని ఉత్సాహపడుతున్నవారిని ఎన్నికల సంఘం నిబంధనలు ఆందోళన కలిగిస్తున్నాయి. నామినేషన్ పత్రంలో పేర్కొన్న నిబంధనలతో పోటీ చేయడం సాధ్యం కాదని ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. గురువారం నగునూరు క్లస్టర్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే సందర్శించి నిబంధనల ప్రకారం ఉన్న నామినేషన్లను మాత్రమే అంగీకరించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తప్పనిసరిగా కులం సర్టిఫికెట్, నేషనల్‌బ్యాంకు ఖాతా, స్థానిక బ్యాంకుల నుంచి రుణ బకాయిలు లేవని నోడ్యూస్ సర్టిఫికెట్, క్రిమినల్ కేసులు, కోర్టు కేసులు లేవంటూ నోటరీ నుంచి రూ.50 అఫిడవిట్ సర్టిఫికెట్, గ్రామపంచాయతీ, విద్యుత్ సంస్థ నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్లను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని అభ్యర్థులు ఒక్క రోజులో పొందడం సాధ్యమయ్యే పనికాదు. స్థానిక బ్యాంకులు కాకుండా నేషనల్‌బ్యాంకుల్లో ఖాతా తీసుకోవాలనే నిబంధన పెట్టడంతో అభ్యర్థులందరూ కరీంనగర్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకు నిబంధనలతో ఒక్కరోజులో ఖాతాపుస్తకం వచ్చే అవకాశంలేదని ఆశావహులు పేర్కొంటున్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ స్ధానాల్లో పోటీ చేసే అభ్యర్ధులు తప్పనిసరిగా కులం సర్టిఫికెట్ జత చేయాల్సి ఉంటుంది. కులం సర్టిఫికెట్లకోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నట్లయితే తహసీల్దార్ కార్యాలయం నుంచి జారీ చేస్తారు. గతంలో ఉన్న కులం సర్టిఫికెట్ల నంబరుతో మీ సేవా కేంద్రాల్లో అప్‌డేట్ చేసుకునే అవకాశముందని కరీంనగర్‌రూరల్ తహసీల్దార్ రాజేశ్ తెలిపారు. కొత్త సర్టిఫికెట్లను సైతం ఒక్క రోజులోనే జారీ చేస్తామని వివరించారు. నామినేషన్ పత్రానికి సర్టిఫికెట్లు జత చేసినపుడే నామినేషన్ చెల్లుబాటవుతుందని లేకపోతే పరిశీలనలో కొట్టివేస్తారని పలువురు పోటీదారులు తెలిపారు.


