వీధి దీపాల నిర్వహణ మెరుగుపడాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో వీధి దీపాల నిర్వహణను మెరుగు పరచాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. గురువారం ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. నగరవ్యాప్తంగా వీధి దీపాలు సక్రమంగా వెలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తిచేసిన వీధిదీపాల మెటిరియల్స్ త్వరగా తెప్పించాలని, అవసరం మేరకు లైట్లు తెప్పించేందుకు టెండర్ పిలవాలని సూచించారు. నగరపాలకసంస్థకు సంబంధించిన విద్యుత్ మీటర్లపై ప్రత్యేకంగా సర్వే చేపట్టాలని అన్నారు. వినియోగంలో లేని విద్యుత్ మీటర్లుంటే గుర్తించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. నగరంలోని ప్రతి మీటర్లను తనిఖీ చేసి వారం రోజుల్లోగా తనకు నివేదిక ఇవ్వాలన్నారు. ఈఈలు సంజీవ్ కుమార్, శివానందం, డీఈలు లచ్చిరెడ్డి, దేవేందర్, అరుణ్, ఓం ప్రకాష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సెలార్లను పార్కింగ్‌కే వినియోగించాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని భవన యజమానులు సెల్లార్లను పార్కింగ్‌కు మా త్రమే వినియోగించాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. సెల్లార్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా నగరంలోని మంకమ్మతోట, జ్యోతినగర్, క్రిస్టియన్‌కాలనీల్లోని భవనాలను నగరపాలకసంస్థ పట్టణ ప్రణాళిక అధికారులు తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాల్లోని 22 వాణిజ్య భవనాలను పరిశీలించగా, 13 భవనాలు సెల్లార్‌లను పార్కింగ్‌కు బదులు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించి, నోటీసులు అందజేశారు. సెల్లార్ సర్వేను స్వయంగా పరిశీలించిన కమిషనర్, సర్వే జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. సెల్లార్లను ఇతరత్రా వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


