పీఎంశ్రీ పాఠశాలల్లో ‘చెలిమి’
విద్యార్థుల్లో భరోసా కల్పించడమే లక్ష్యంగా
నూతన కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం
శిక్షణ పూర్తి చేసుకున్న రిసోర్స్ పర్సన్లు
కరీంనగర్‌టౌన్: నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులు అతి సున్నిత మనస్కులుగా తయారువుతున్నారు. చిన్నపాటి సమస్యలకే పెద్ద నిర్ణయాలు తీసుకుని తల్లిదండ్రులకు శోకం మిగిల్చుతున్నారు. దీనికి అతి గారాబం, సోషల్ మీడియా ప్రభావం, విద్యాపరమైన ఒత్తిళ్లే కారణం అని మనసిక నిపుణులు చెబుతున్నారు. కేంద్ర విద్యాశాఖ జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యార్థుల్లో భావోద్వేగ స్థిరత్వం, ఆత్మ విశ్వాసం, పాజిటివ్ ఆలోచనలు పెంపొందించేందుకు ప్రారంభించిన చెలిమి సోషియో– ఎమోషనల్ వెల్ బీయింగ్ ప్రోగ్రాం పాఠశాలల్లో కొత్త శకానికి నాంది పలకనుంది. చదువుతోపాటు పిల్లల మనస్తత్వం, ప్రవర్తన, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడేలా రూపొందించిన ఈ కార్యక్రమం అమలుకు ప్రతి పీఎంశ్రీ పాఠశాలలో ఒక నోడల్ టీచర్ ప్రత్యేక శిక్షణ ఇటీవల హైదరాబాద్‌లో పొందారు. ఇందుకు అవసరమైన నైపుణ్యాలను ఈ టీచర్లు శిక్షణలో అభివృద్ధి చేసుకుంటారు. అనంతరం పాఠశాలల్లో 6వ తరగతి నుంచి పైవరకు చెలిమి కరిక్యులాన్ని అమలుచేయనున్నారు.
జిల్లాలో 22 పీఎంశ్రీ పాఠశాలలు
జిల్లాలో మొదటి విడతగా 13, రెండో విడతలో 9, మొత్తంగా 22 పాఠశాలలు పీఎంశ్రీ పథకం కింద ఎంపికయ్యాయి. ఈ నెల 24 నుంచి పాఠశాల టీచర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చెలిమి శిక్షణ పొందినవారు పాఠశాలలో నోడల్ టీచర్‌గా పనిచేస్తారు. ఇతర ఉపాధ్యాయులకూ మార్గదర్శనం చేస్తారు. విద్యార్థుల మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తారు. పాఠశాలలో పాజిటివ్ లెర్నింగ్ వాతావరణాన్ని రూపొందిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు చదువు మాత్రమే కాకుండా మంచి వ్యక్తిత్వం, నైతికత, ఆరోగ్యమైన సామాజిక ప్రవర్తన కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తర్పీదు ఇవ్వనున్నారు.


