మూడు విడతల్లో
మోగిన పంచాయతీ నగారా ఎన్నికల షెడ్యూల్ విడుదల పోలింగ్ రోజు సాయంత్రమే ఫలితాలు అమలులోకి ఎన్నికల కోడ్ ఏర్పాట్లలో నిమగ్నమైన జిల్లా యంత్రాంగం
మొదటి విడతలో మండలాలు: గంగాధర, కరీంనగర్‌రూరల్, కొత్తపల్లి, రామడుగు, చొప్పదండి
రెండో విడతలో: చిగురుమామిడి, గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం
మూడో విడతలో: ఇల్లందకుంట, జమ్మికుంట, హుజురాబాద్, వీణవంక, సైదాపూర్
పల్లెపోరు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ ●:
పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో రాజకీయ పార్టీల నాయకులు, ఆశావహుల నిరీక్షణకు తెరపడింది. నేటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే డిసెంబర్ 17వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఈనెల 27న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, సర్పంచ్, వార్డు సభ్యులకు డిసెంబర్ 11,14,17వ తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. కోర్టు కేసుల నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలోని రెండు గ్రామపంచాయతీలు మినహా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. షెడ్యూల్ విడుదలతో కోడ్ అమల్లోకి రాగా, పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది.
ఉత్కంఠకు తెర
బీసీలకు స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ సెప్టెంబర్‌లో ఎన్నికల షెడ్యూల్ విడుదలై, నామినేషన్లు పక్రియ ప్రారంభమైన తర్వాత హైకోర్టు స్టేతో ఎన్నికల పక్రియ నిలిచిపోయింది. దీంతో ఎన్నికల నిర్వహణపై అయోమయం నెలకొంది. తాజాగా ప్రభుత్వం 2019లో 50 శాతం మించకుండా ఇచ్చిన రిజర్వేషన్‌లను అనుసరిస్తూ రోటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా రిజర్వేషన్స్ ఖరారు చేసి ఆదివారం ఆయా జిల్లాలోని ప్రజాప్రతినిధుల సమక్షంలో లాటరీ ద్వారా మహిళలకు మొత్తం స్థానాల్లో సగం సీట్లు కేటాయించారు. దీంతో రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో నడుస్తున్నా జీపీలకు పాలకవర్గాల ఎన్నికకు మార్గం సుగమం అయ్యింది.
సర్వం సిద్ధం
ఎన్నికల ఏర్పాట్లపై యంత్రాంగం ఇప్పటికే సర్వం సిద్ధం చేసింది. తుది ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర సామగ్రి సమకూర్చుకున్నారు. ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనుండగా, పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలు వెల్లడించి, ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు. ఏదైనా కారణంతో ఉపసర్పంచ్ ఎన్నిక జరగకుంటే మరుసటి రోజు ఎన్నుకుంటారు.
కరీంనగర్ జిల్లా సమాచారం
మొత్తం జీపీలు : 316
వార్డులు : 2,946
పోలింగ్ కేంద్రాలు : 2,946


