సదరం.. సౌకర్యం
కరీంనగర్: జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో చాలాకాలంగా సదరం శిబిరాలు నిర్వహిస్తున్నా అరకొర వసతులతో దివ్యాంగులకు ఇబ్బందిగా ఉండేవి. డీఆర్డీఏ, ప్రభుత్వాసుపత్రి సంయుక్తంగా శిబిరాలు నిర్వహిస్తున్నాయి. వైద్యులు దివ్యాంగులను పరీక్షించి సదరం (యూడీఐడీ) సర్టిఫికెట్ జారీచేస్తారు. కాగా శిబిరంలో దివ్యాంగులు నిలుచునేందుకు, కూర్చోడానికి స్థలం లేక ఆసుపత్రి ఆవరణ, ఆరుబయట అరుగులపై సేదతీరేవారు. ఇటీవల దివ్యాంగులు ఎప్పుడైనా స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించడంతో భారీగా బుక్ చేసుకుంటున్నారు. దీంతో వారంలో రెండుసార్లు సదరం శిబిరాలు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ప్రతీ శిబిరంలో 100 నుంచి 120 మందికి వైద్యులు వైకల్య పరీక్షలు నిర్వహించి అర్హత ఉన్నవారికి సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు.
కలెక్టర్ చొరవతో..
సదరం శిబిరంపై కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. శిబిరానికి హాజరయ్యే వికలాంగుల పరిస్థితిని గమనించిన కలెక్టర్ ప్రత్యేక షెడ్ల నిర్మాణం కోసం ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్, సెర్ప్ విభాగాలతో మాట్లాడి నిధులు మంజూరు చేయించారు. వెంటనే పనులు ప్రారంభించిన ఆయా విభాగాలు షెడ్ల నిర్మాణాన్ని దాదాపుగా పూర్తిచేశాయి. ఇక ఫినిషింగ్ పనులు మిగిలి ఉన్నాయి. ఇవి కూడా మరో రెండు వారాల్లో పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.


