ప్రభుత్వ వైద్యురాలి సస్పెన్షన్
హుజూరాబాద్: పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో సీ్త్ర వైద్య నిపుణురాలిగా పనిచేస్తున్న నందితారెడ్డిని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు విధుల నుంచి సస్పెండ్ చేస్తూ డీఎంహెచ్‌వో వెంకటరమణ ఉత్తర్వులు జారీ చేశారు. కొద్దిరోజుల క్రితం హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి సైదాపూర్ మండలం గొడిశాలకు చెందిన గర్భిణి డెలివరీ కోసం రాగా, అప్పుడు విధులు నిర్వహిస్తున్న నందితారెడ్డి నిర్లక్ష్యంతో గర్భిణి మూడురోజుల తర్వాత మృతిచెందింది. మృతురాలి బంధువులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా అధికారులు విచారణ చేపట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు.
విద్యాశాఖ సూపరింటెండెంట్..
కరీంనగర్ టౌన్: జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఎన్.నరసింహస్వామి సస్పెండ్ అయ్యారు. మంగళవారం వరంగల్ ఆర్‌జేడీ ఉత్తర్వులు జారీచేశారు. పాత ఎస్సెస్సీ సమాధాన పత్రాల విక్రయం.. నిధుల దుర్వినియోగం తదితర అభియోగాలు రావడంతో ఆయనను సస్పెండ్ చేసినట్లు ఆర్జేడీ పేర్కొన్నారు. ఇంకా విచారణ కొనసాగుతుందని వివరించారు.
29న సాంస్కృతిక పోటీలు
కరీంనగర్‌కల్చరల్: ప్రపంచ విద్యార్థుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 29న కళాభారతిలో గురూస్, స్టూడెంట్స్, పేరెంట్స్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేశం తెలిపారు. చిత్రలేఖనం, పాటలు, ఉపన్యాసం, వ్యాసరచన తదితర పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనేవారు 90322 74304 నంబర్‌కు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.
3న దివ్యాంగుల క్రీడాపోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి తెలిపారు. డిసెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అంధులకు షాట్‌పుట్, రన్నింగ్, చెస్, బధిరులకు షాట్‌పుట్, జావలిన్‌త్రో, రన్నింగ్, శారీరక దివ్యాంగులకు షాట్‌పుట్, జావలిన్‌త్రో, క్యారం, మానసిక దివ్యాంగులకు షాట్‌పుట్, రన్నింగ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆసక్తి ఉన్న దివ్యాంగులు పుట్టిన తేదీ నిర్ధారణకు సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు.
నిలకడగా పత్తి ధర
జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్‌లో పత్తి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. మంగళవారం క్వింటాల్ గరిష్ట ధర రూ.6,950 పలికింది. 79 వాహనాల్లో 670 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తీసుకువచ్చారు. క్వింటాల్‌కు మోడల్ ధర రూ.6,800, కనిష్ట ధర రూ.6,300 చెల్లించారు. క్రయవిక్రయాలను మార్కెట్ చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్నసదానందం, ఇన్‌చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.
పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ సంబంధిత పనులు చేపడుతున్నందున బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 11 కేవీ రాంనగర్ ఫీడర్‌పరిధిలో కరెంట్ సరఫరా ఉండదని టౌన్– 2 ఏడీఈ లావణ్య తెలిపారు. మంకమ్మతోట, పారమిత స్కూల్, సిద్ధార్థ స్కూల్ ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు.
కరీంనగర్‌రూరల్: ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం పథకం కింద యాసంగిలో రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి జె.భాగ్యలక్ష్మి తెలిపారు. మంగళవారం దుర్శేడ్ రైతువేదికలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం పథకంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. అనంతరం విత్తన చట్టం–2025, వరి, పత్తిపంటల కోత అనంతరం అవశేషాల నిర్వహణపై శాస్త్రవేత్త ఉమ్మారెడ్డి అవగాహన కల్పించారు. తర్వాత దుర్శేడ్‌లో రైతులు సాగు చేసిన కూరగాయల పంటను డీఏవో పరిశీలించారు. వరికొయ్యలను కాల్చడంతో జరిగే నష్టంపై రైతులకు వివరించారు. ఏవో సత్యం, ఏఈవో స్వర్ణలత, బీటీఎం శ్రీలత పాల్గొన్నారు.
ప్రభుత్వ వైద్యురాలి సస్పెన్షన్


