స్థానిక ఎన్నికలకు రెడీ
సీపీ గౌస్ ఆలం
కరీంనగర్‌క్రైం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ యంత్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉండాలని సీపీ గౌస్ ఆలం ఆదేశించారు. మంగళవారం కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సన్నద్ధత, శాంతిభద్రతల పరిరక్షణపై పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా జరిగేలా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. గత ఎన్నికల సమయంలో నియమావళిని ఉల్లంఘించినవారు, పాత నేరస్తులను వెంటనే బైండోవర్ చేయాలని, లైసెన్స్ కలిగిన తుపాకులను వెంటనే ఆయా పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయించుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో బెల్టు షాపులను పూర్తిగా నిలిపివేయాలని, అక్రమ మద్యం రవాణా, నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్థానిక ఎస్‌హెచ్‌వోలు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను స్వయంగా సందర్శించి, వసతులు, భద్రతాపరమైన అంశాలను పరిశీలించాలని సూచించారు. గ్రామ పోలీస్ అధికారుల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, ఎన్నికల దృష్ట్యా ఎక్కడైనా చిన్న సమస్య తలెత్తినా వెంటనే స్పందించి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


