అడ్డదారిలో కన్సల్టెన్సీ!
కరీంనగర్‌కార్పొరేషన్: నగరపాలకసంస్థలో ప్రైవేట్ కన్సల్టెన్సీ పేరిట లక్షల రూపాయల స్వాహాకు వేగంగా అడుగులు పడుతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాలు అమలు చేసే బాధ్యతను నిబంధనలు విరుద్ధంగా ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీకి నేరుగా అప్పగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా, ఎవరినీ సంప్రదించకుండా నేరుగా తమ అనుయాయులకు నెలకు రూ.1.85 లక్షలు అప్పగించేందుకు ఒప్పందం చేసుకున్నారు. చివరి నిమిషంలో ఓ ఉన్నతాధికారి జోక్యం చేసుకోవడంతో ఈ వ్యవహారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది.
కన్సల్టెన్సీకి ఓకే..
నగరంలో స్వచ్ఛత, శుభ్రతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్‌ను 2015లో ప్రారంభించడం తెలిసిందే. మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌లలో పారిశుధ్య పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న కార్యక్రమాల వారీగా స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా దేశ, రాష్ట్ర వ్యాప్తంగా ఏటా ర్యాంక్‌లు ఇస్తుండడం తెలిసిందే. ప్రస్తుతం నగరపాలకసంస్థనే స్వయంగా స్వచ్ఛసర్వేక్షన్ కార్యక్రమాలను అమలు చేస్తూ వస్తోంది. అయితే 2025–26 సంవత్సరానికి గాను స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాల అమలు బాధ్యతను ప్రైవేట్ కన్సల్టెన్సీకి అప్పగించేందుకు పారిశుధ్య అధికారులు నిర్ణయించారు.
మనోళ్లయితే సరే..
నగరంలో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాల అమలు బాధ్యతలను ప్రైవేట్ కన్సల్టెన్సీకి అప్పగించేందుకు కొంతమంది అధికారులు వేగంగా పావులు కదిపారు. తమ అనుయాయులకు అప్పగించే ఉత్సాహంతో ఉన్న ఆ అధికారులు ఈ దిశగా ఫైళ్లను నడిపించారు. సాధారణంగా ప్రైవేట్ కన్సల్టెన్సీకి అప్పగించేందుకు ముందుగా నగరపాలక తరఫున నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. తర్వాత దరఖాస్తు చేసుకొని కన్సల్టెన్సీల చరిత్ర, గత పనితీరు, ఇతరత్రా వివరాల ఆధారంగా కాంట్రాక్ట్ అప్పగిస్తారు. కానీ ఇక్కడ అలాంటి నిబంధనలు పట్టించుకున్న పాపాన పోలేదు.
నెలకు రూ.1.85 లక్షలు
నగరపాలక పరిధిలో స్వచ్ఛ సర్వేక్షన్ డాక్యుమెంటేషన్, ప్రచార, అవగాహన కార్యక్రమాలు అమలు చేసే బాధ్యతను వరంగల్‌కు చెందిన ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నెలకు రూ.1.85 లక్షలు కన్సల్టెన్సీకి చెల్లించాలి. కొంతమంది పారిశుధ్య అధికారులు తెరవెనుక నడిపించిన తతంగం కారణంగా ఎలాంటి నోటిఫికేషన్, పోటీలు లేకుండానే ఖరారైంది. స్వచ్ఛ సర్వేక్షన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడం, ర్యాంక్‌లకు సంబంధించి డాక్యుమెంటేషన్ చేయడం కన్సల్టెన్సీ బాధ్యతలు. అయితే ఉత్పత్తి అవుతున్న చెత్త, రీసైకిల్ అవుతున్న చెత్త వివరాలు ప్రస్తుతం నెలవారీగా అర్డన్ డెవలప్‌మెంట్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ వివరాల ఆధారంగానే మున్సిపాల్టీలకు ర్యాంక్‌లు ఇస్తున్నారు. దీంతో ప్రస్తుతం డాక్యుమెంటేషన్ అవసరం పెద్దగా లేకుండా పోయింది. అయినా నెలకు రూ.1.85 లక్షలు చెల్లించేలా కాంట్రాక్ట్ అప్పగించాలని నిర్ణయించడం గమనార్హం.
తాత్కాలికంగా బ్రేక్
నెలకు రూ.1.85 లక్షలు ఏడాది పాటు చెల్లిస్తూ కాంట్రాక్ట్ అప్పగించేందుకు దాదాపు రంగం సిద్ధమైనా, చివరి నిమిషంలో ఓ ఉన్నతాధికారి బ్రేక్ వేసినట్లు విశ్వసనీయ సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా, తదితర కారణాలతో సదరు ఉన్నతాధికారి ఈ కన్సల్టెన్సీని అప్పగించడాన్ని నిలిపివేసినట్లు వినికిడి. అయితే తాత్కాలికంగా బ్రేక్ పడినా, ఎలాగైనా కన్సల్టెన్సీకి కాంట్రాక్ట్ దక్కేలా చేసేందుకు సదరు అధికారులు పావులు కదుపుతున్నట్లు సమాచారం.


