వినూత్నం.. అద్భుతం
కరీంనగర్‌టౌన్: జిల్లాలో కలెక్టర్ పమేలా సత్పతి నేతృత్వంలో విద్యారంగ అభివృద్ధికి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి ప్రశంసించారు. జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి చేపట్టిన సంస్కరణలు, వివిధ కార్యక్రమాలపై గురువారం కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో కలెక్టర్, విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన బోధన స్నేహిత, కాన్షియస్ క్లబ్‌ల ఏర్పాటు తదితర కార్యక్రమాలపై కలెక్టర్ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లాలో చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని విద్యా కమిషన్ చైర్మన్ పేర్కొన్నారు. సీఎం చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలు అమలయ్యేలా తన వంతు కృషి చేస్తానన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 200 మండలాల్లో మండలానికి ఒకటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని వెల్లడించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికా రులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇందుకు ప్రత్యేకంగా సహకరిస్తున్నారని వివరించారు. అనంతరం పదోతరగతి విద్యార్థుల కోసం డీసీబీ, డీసీఈవీ ఆధ్వర్యంలో తయారుచేసిన సమగ్ర మూల్యాంక దర్శినిని ఆవిష్కరించారు. డీఈవో మొండయ్య, క్వాలిటీ కోఆర్డినేటర్ కె. అశోక్‌రెడ్డి, జిల్లా సైన్స్ ఆఫీసర్ జైపాల్‌రెడ్డి, ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రీనివాసు, జెండర్ కోఆర్డినేటర్ కృపారాణి, డీసీఈబీ సెక్రటరీ భగవంతయ్య, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ రవీందర్ తదితరులున్నారు.


