ఆస్పత్రి నిధులు ఏమయ్యాయి?
కరీంనగర్: జిల్లా జనరల్ ఆస్పత్రిలో రూ.4.50కోట్ల స్కాం జరిగిందంటూ వచ్చిన ఫిర్యాదుపై తెలంగాణ వైద్య విధాన పరిషత్ విచారణ చేపట్టింది. అధికారులతో కూడిన రెండు బృందాలను ఏర్పాటు చేసింది. ఈ రెండు బృందాలు గురువారం జిల్లా జనరల్ ఆసుపత్రికి చేరుకొని విచారణ చేపట్టాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ స్టేట్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సూర్యశ్రీరావు, అసిస్టెంట్ ఫైనాన్స్ ఆఫీసర్ యాదగిరి బృందం జిల్లా జనరల్ ఆసుపత్రికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సంబంధిత అధికారులను కూడా విచారించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఎం.అనిత గ్రేస్, డాక్టర్ ఎన్.కృష్ణమోహన్, అసిస్టెంట్ ఫైనాన్స్ ఆఫీసర్ వై.శ్రీనివాస్ బృందం మెడికల్ కాలేజీలో ఉన్న రికార్డులను పరిశీలించి అధికారులను విచారించారు. ఈ విషయమై తెలంగాణ వైద్య విధాన పరిషత్ స్టేట్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వై.సూర్యశ్రీరావును వివరణ కోరగా.. తామంతా రూ.4.50కోట్ల స్కాంకు సంబంధించి విచారణ చేయాలని కమిషనర్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా జనరల్ ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపారు. దీనిపై ఇదివరకే రెండుసార్లు కమిటీలు వేసినట్లు వెల్లడించారు. ఆడిట్ వివరాలను కూడా తీసుకున్నామని తెలిపారు. రెండు కమిటీలు గుర్తించిన లోపాలు, ఆడిట్లో గుర్తించిన లోపాలను సంబంధిత అధికారులు సరి చేశారా లేదా అనే విషయాలను పరిశీలిస్తున్నామన్నారు. ఈ రిపోర్టును కమిషనర్‌కు అందజేస్తామని స్పష్టం చేశారు.


