‘ఉపాధి’ పేరిట నిలువు దోపిడీ | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ పేరిట నిలువు దోపిడీ

Nov 14 2025 8:21 AM | Updated on Nov 14 2025 8:21 AM

‘ఉపాధి’ పేరిట నిలువు దోపిడీ

‘ఉపాధి’ పేరిట నిలువు దోపిడీ

●మల్లాపూర్‌ మండలం గొర్రెపల్లికి చెందిన ఓ వ్యక్తి యూరప్‌ వెళ్లేందుకు ఓ ఏజెంట్‌ను సంప్రదించాడు. సదరు ఏజెంట్‌కు రూ.లక్ష వరకు అప్పగించి ఇప్పుడు నెలల తరబడి ఏజెంట్‌ చుట్టూ తిరుగుతున్నాడు. ●కథలాపూర్‌ మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు స్థానికంగా గుమస్తాలు. యూరప్‌ వెళ్తే వేతనం బాగుంటుందని ఓ ఏజెంట్‌ను సంప్రదించారు. వీరిలాగే కరీంనగర్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కాంపౌండర్లుగా పనిచేస్తున్న ఇద్దరు కూడా ఏజెంట్‌ను సంప్రదించి రూ.లక్షలు అతడి చేతిలో పోశారు. ●రాయికల్‌ మండలం మూటపల్లికి చెందిన ఓ యువకుడి వ్యవసాయ భూమి లేదు. ఉపాధి కూడా లేకపోవడంతో గల్ఫ్‌ వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. జగిత్యాలకు చెందిన ఓ ఏజెంట్‌ను సంప్రదించాడు. సదరు ఏజెంట్‌ న్యూజిలాండ్‌ పంపిస్తానని, అక్కడ వేతనం బాగుంటుందని నమ్మబలికాడు. అతడి నుంచి రూ.లక్ష వరకు తీసుకుని ఇప్పుడు చేతులెత్తేశాడు. ●రాయికల్‌ మండల కేంద్రానికి చెందిన ఓ ఏజెంట్‌ సుమారు 12 మందిని పోలాండ్‌, రష్యా, దుబాయ్‌, న్యూజిలాండ్‌కు పంపిస్తామని చెప్పి ఏడు నెలల క్రితం ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష తీసుకున్నాడు. వారిని ఏ దేశానికీ పంపించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న సదరు ఏజెంట్‌ వారిని విదేశాలకు పంపించకుండా.. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా సతాయిస్తున్నారు. ఒత్తిడి పెంచితే తానే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ●గొల్లపల్లి మండలం బొంకూర్‌కు చెందిన ఓ యువకుడు గల్ఫ్‌ వెళ్లాలని నిర్ణయించుకుని జగిత్యాలలోని ట్రావెల్స్‌ నిర్వాహకుడు హరీశ్‌కు పాస్‌పోర్టు అప్పగించాడు. చెప్పిన పని కాకుండా ఇతర పనిమీది వీసా వచ్చిందని నమ్మించాడు. తాను వెళ్లనని చెబితే ఏజెంట్‌ పెట్టే ఇబ్బంది తాళలేక వారం క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

జగిత్యాలక్రైం: ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లే వారి సంఖ్య జిల్లాలో రెండేళ్లుగా పెరిగిపోతోంది. దీనిని అదునుగా తీసుకుంటున్న కొంతమంది ఏజెంట్లు గల్ఫ్‌ దేశాలకు పంపిస్తామంటూ వారి నుంచి రూ.లక్షలు తీసుకుని తప్పించుకు తిరుగుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా జిల్లాలో సుమారు 120 ట్రావెల్స్‌లు కొనసాగుతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు విదేశీల్లో ఉపాధి కల్పిస్తామని ఆశచూపి.. అందినంతా దండుకుని మోసాలకు పాల్పడుతున్నారు. వాస్తవానికి వీరు విమాన టికెట్స్‌ బుకింగ్‌ చేసేందుకే అనుమతి తీసుకొని నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పి పాస్‌పోర్టులు తీసుకుని.. ఇంటర్వ్యూలకు హాజరుపరుస్తూ.. వీసా వచ్చిందని నమ్మిస్తూ.. డబ్బులు వసూలు చేస్తున్నారు. అదే ట్రావెల్స్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా మనీ ట్రాన్స్‌ఫర్‌ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులు కూడా వీరిని గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు.

35 మందికే లైసెన్స్‌

జిల్లాలో గల్ఫ్‌ పంపించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నుంచి కేవలం 35 మంది ఏజెంట్లు మాత్రమే లైసెన్స్‌లు తీసుకున్నారు. మిగతా వారంతా అనుమతి లేకుండానే ట్రావెల్స్‌ నిర్వహిస్తున్నారు. ఏజెంట్లుగా చలామణి అవుతూ నిరుద్యోగులను వీసాల పేరుతో మోసం చేస్తున్నారు.

లైసెన్స్‌ లేకున్నా ఇంటర్వ్యూలు

గల్ఫ్‌ ఏజెంట్లు, ట్రావెల్స్‌ నిర్వాహకులు లైసెన్స్‌లు ఉన్నప్పటికీ ఎస్‌బీ (స్పెషల్‌ బ్రాంచ్‌) పోలీసులకు సమాచారం అందించాకే ఇంటర్వ్యూలు నిర్వహించాలి. కానీ నిర్వాహకులు పోలీసులకు సమాచారం లేకుండానే బహిరంగంగానే పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులను ఇంటర్వ్యూలకు పిలిపించి పాస్‌పోర్టులు తీసుకుంటున్నారు. అనంతరం వారికి ఏదో ఒక వీసా అప్పగిస్తున్నారు. యూరప్‌ దేశాల్లో ఉద్యోగాలున్నాయని సుమారు రూ.నాలుగు లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement