కూరగాయల కొరతకు చెక్
కరీంనగర్‌రూరల్: కూరగాయల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కూరగాయల రైతులను ప్రోత్సహించేందుకు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. సమీకృత ఉద్యాన మిషన్ పథకం ద్వారా ఎకరానికి రూ.9600 సబ్సిడీ చెల్లిస్తోంది. ఎకరంలో కూరగాయలను సాగు చేసేందుకు రూ.24వేల ఖర్చు కాగా 40శాతం సబ్సిడీ అంటే రూ.9600 నేరుగా రైతుల బ్యాంకుఖాతాల్లోనే జమచేస్తారు. యాసంగి సీజన్‌లో జిల్లాలో 150 ఎకరాలు లక్ష్యం కాగా కరీంనగర్ మండలం గోపాల్‌పూర్, తాహెర్‌కొండాపూర్, మల్కాపూర్, కొత్తపల్లి, చామనపల్లి,నల్లగుంటపల్లి, మల్కాపూర్, తిమ్మాపూర్, రామడుగు, గంగాధర, చొప్పదండి మండలాలతో పాటు చెంజర్ల, కొండపల్కల తదితర గ్రామాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారు.
ఈ కూరగాయలకు సబ్సిడీ
ప్రధానంగాతీగజాతి కూరగాయల సాగును ప్రోత్సహించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. బీర, కాకర, సొరకాయలతోపాటు టమాట, వంగ, పచ్చిమిర్చి, క్యాబేజీ, కాలీఫ్లవర్ తదితర కూరగాయలను రైతులు సాగుచేస్తే సబ్సిడీ లభిస్తుంది. కూరగాయల నారును సిద్దిపేట జిల్లా ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌నుంచి, విత్తనాలను గుర్తింపు పొందిన నర్సరీల నుంచి కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. నారు, విత్తనాలను కొనుగోలు చేసిన రసీదులను ఉద్యానశాఖ కార్యాలయంలో సమర్పిస్తే ఎకరానికి రూ.9600 చొప్పున సబ్సిడీ రైతుల బ్యాంకుఖాతాల్లో జమ చేస్తారు.
కూరగాయల రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్, బ్యాంకుఖాతాపుస్తకంతో దరఖాస్తు చేసుకోవాలి. రైతులు తమకు ఇష్టమైన కూరగాయల రకాలను సాగు చేసుకునేందుకు అవకాశముంది. రైతులు ఎంపిక చేసుకున్న కూరగాయల పంటకు సబ్సిడీ నేరుగా బ్యాంకుఖాతాలో జమవుతుంది.
– వి.అయిలయ్య, ఉద్యానశాఖ అధికారి,
ఉమ్మడి కరీంనగర్ మండలం


