అలర్ట్.. అలర్ట్!
సిటీని జల్లెడ పడుతున్న పోలీసులు
డాగ్‌స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ డివైస్‌లతో నిరంతరం తనిఖీలు
అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు
కరీంనగర్‌క్రైం: ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటన తర్వాత కరీంనగర్ పోలీసులు అలర్ట్ అయ్యారు. నిరంతర తనిఖీలు చేస్తూ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. నగరంతో పాటు జిల్లావ్యాప్తంగా రద్దీ ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో వాహనతనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్ పరిసరాలు, శివారు ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. నేరాలను అరికట్టడానికి, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువుల కదలికలను గుర్తించడానికి నాకాబందీ చేపడుతున్నారు. ముఖ్యంగా నగరంలోని బస్టాండ్‌లో ఏర్పాటుచేసిన కార్గో సెంటర్‌పై పోలీసులు ఫోకస్ పెట్టారు. కరీంనగర్ బస్టాండ్‌లోని కార్గో సెంటర్ ద్వారా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పార్సిళ్లు రవాణా అవుతుంటాయి. కొన్ని ప్రైవేటు కొరియర్ల ద్వారా అనుమనాస్పద వస్తువులు రవాణా జరిగే అవకాశాలున్నాయని, గంజాయి స్మగ్లర్లు ఎక్కువగా బస్సులు, రైళ్ల ద్వారానే సరుకు తరలిస్తున్నారన్న అనుమానంతో కార్గో సెంటర్లలో డాగ్‌స్క్వాడ్‌తో నిత్యం తనిఖీలు చేపడుతున్నారు. కరీంనగర్ శివారు ప్రాంతాలైన పద్మనగర్, రేకుర్తి, ఎన్‌టీఆర్‌చౌరస్తా, బొమ్మకల్‌చౌరస్తా, సిరిసిల్ల బైపాస్‌తో పాటు శివారు ప్రాంతాలు, నగరంలోని తెలంగాణచౌక్, మంచిర్యాల చౌరస్తా, కోర్టు చౌరస్తా, రాంనగర్, కోతిరాంపూర్, బద్దం ఎల్లారెడ్డి చౌరస్తాతో పాటు ముఖ్య కూడళ్లలో విస్తృత వాహన తనిఖీలు చేపడుతున్నారు. నిత్యం వాహన తనిఖీలు కొనసాగుతాయని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100 లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబరు 87126 70744కు సమాచారం ఇవ్వాలని సీపీ గౌస్ ఆలం సూచించారు.


