ఎక్కువ.. తక్కువ!
బల్దియా లేబర్ కేటాయింపుల్లో తేడాలు
కొన్ని డివిజన్లలో 24 మంది
మరికొన్నింటిలో తొమ్మిది మందితో సరి
పారిశుధ్య మెరుగుకు సవరించాలని డిమాండ్
కరీంనగర్ కార్పొరేషన్: నగర పాలకసంస్థ పరిధిలో ని డివిజన్లలో కార్మికుల కేటాయింపు పారిశుధ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొన్ని డివిజన్లలో 24 మంది పారిశుధ్య కార్మికులు ఉండగా, మరికొన్నింటిలో తొమ్మిది మందితోనే సరిపెట్టారు. ఆరేళ్లుగా ఇదే తంతు కొనసాగుతుండగా, ఈ ప్రభావం నగర పారిశుధ్యంపై పడుతోంది. ప్రత్యేకాధికారి పాలనలో ఈ పరిస్థితి మారాలనే డిమాండ్ వినిపిస్తోంది.
985 మంది ఉన్నా అంతంతే
నగరంలో డ్రైనేజీలు తీసేందుకు పురుషులు, రోడ్లు ఊడ్చేందుకు మహిళా పారిశుధ్య కార్మికులుంటారు. తమకు కేటాయించిన డివిజన్లు, రోడ్లు, ప్రాంతాల్లో నే పారిశుధ్య పనులు చేపట్టాల్సి ఉంటుంది. నగరవ్యాపంగా 668 పురుష, 317 మంది మహిళా, మొత్తంగా 985 మంది పనిచేస్తున్నారు. నగర వైశాల్యాన్ని, జనాభాను పరిగణలోకి తీసుకుంటే, నగర శుభ్రతకు ఇంచుమించుగా 650 మంది కార్మికులు ఉంటే సరిపోతుంది. 985మంది ఉన్నప్పటికీ.. నగరంలో పారిశుధ్య నిర్వహణ మెరుగు పడడం లేదు.
ఆ డివిజన్లపై మక్కువేలా?
నగరంలోని పాత 60 డివిజన్లలో పారిశుధ్య కార్మికుల కేటాయింపులో వ్యత్యాసాలు వివాదాస్పదమవుతూ వస్తున్నాయి. ఒక డివిజన్‌లో ఎక్కువగా, మరో డివిజన్‌లో తక్కువగా కార్మికులను నియమించడంతో పారిశుధ్య నిర్వహణ సాఫీగా సాగడం లేదనే ఫిర్యాదులున్నాయి. 45వ డివిజన్‌లో 20 మంది పురుషులు, నలుగురు మహిళలను నియమించారు. 37వ డివిజన్‌లో 17 మంది పురుష, ఏడుగురు మహిళలు, మొత్తం 24 మంది, 33వ డివిజన్‌లో 13 మంది పురుష, ఏడుగురు మహిళలు, మొత్తం 20 మంది పనిచేస్తున్నారు. 23, 39వ డివిజన్‌లలో ఐదుగురు పురుష, నలుగురు మహిళ, మొత్తం 9మంది ఉన్నారు. ఒక డివిజన్‌లో అత్యధికంగా 24 మంది ఉంటే, మరో డివిజన్‌లో కేవలం 9 మంది మాత్రమే పారిశుధ్య పనులను నిర్వహిస్తున్నారు. దాదాపు సమానంగా ఉన్న డివిజన్‌లలో, కార్మికుల కేటాయింపులో మాత్రం ఈ వ్యత్యాసం ఏమిటనేది నగర పాలకసంస్థ అధికారులకే తెలి యాలి. 51వ డివిజన్‌లోనూ 27 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ డివిజన్‌లో టవర్‌సర్కిల్, అంబేడ్కర్ స్టేడియం, కలెక్టరేట్, పోలీసు పరేడ్‌గ్రౌండ్, నగరపాలకసంస్థ తదితర కార్యాలయాలు ఉండడం, వైశాల్యంలోనూ అతి పెద్ద డివిజన్ కావడంతో 27 మంది కార్మికులను నియమించారు. మిగతా డివిజన్‌లలో ఆ పరిస్థితి లేదు.
మెరుగు పడాలంటే సవరించాల్సిందే..
నగరం వేగంగా విస్తరిస్తుండడంతో పారిశుధ్య నిర్వహణ సవాల్‌గా మారింది. ఔట్‌సోర్సింగ్ పద్దతినైనా సరే కొత్తగా కార్మికులను నియమించుకోవడానికి అవకాశం లేదు. ఉన్న కార్మికులతోనే పారిశుధ్య పనులు చేపడుతున్నారు. కొన్ని డివిజన్‌లలో తక్కువగా ఉండడంతో ఆ ప్రాంతాల్లో పారిశుధ్యం అధ్వానంగా మారుతోంది. ప్రస్తుతం ప్రత్యేకాధికారి పాలనలోనైనా ఈ పరిస్థితిలో మార్పు రావాలని ఆయా డివిజన్ వాసులు కోరుతున్నారు. ఏదేమైనా డివిజన్‌ల వారిగా కార్మికుల కేటాయింపులను సవరిస్తే, నగరవ్యాప్తంగా పారిశుధ్య నిర్వహణ కాస్త మెరుగుపడే అవకాశం ఉంది.


