అదుపుతప్పిన బైక్.. స్నేహితుల దుర్మరణం
వేములవాడఅర్బన్: అతివేగం ఇద్దరు స్నేహితుల ప్రాణం తీసింది. తల్లిదండ్రులకు కన్నీటి శోకం మిగిల్చింది. ఇరు కుటుంబాలకు ఒక్కగానొక్క కుమారులు మృతిచెందడంతో తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రం హనుమాన్‌వీధికి చెందిన గుడికందుల మణిచరణ్ (18) అగ్రహారంలో అద్దె గదిలో ఉంటూ శ్రీ రాజరాజేశ్వరస్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుకుంటున్నాడు. ఆదివారం తన స్నేహితుడి బైక్ తీసుకుని సిరిసిల్ల మండలం రగుడులోని మరో స్నేహితుడు, క్లాస్‌మేట్ బూర శశికుమార్ (18) వద్దకు వెళ్లి తిరిగి ఇద్దరూ వస్తున్నారు. వేములవాడ మండలం అగ్రహారం శివారులోని సిరిసిల్ల– వేములవాడ రహదారిపై అతివేగంతో బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మణిచరణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. శశికుమార్‌ను కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అదుపుతప్పిన బైక్.. స్నేహితుల దుర్మరణం


