అమ్మకు టిఫిన్ ఇచ్చేందుకు వెళ్తూ అనంత లోకాలకు
● రోడ్డు ప్రమాదంలో కూతురు మృతి
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లికి టిఫిన్(భోజనం) ఇచ్చేందుకు వెళ్తూ మోయా లావణ్య(43) శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని తన అత్తగారి ఇంట్లో ఉంటున్న స్వశక్తి మహిళా సంఘం సీఏ మోయా లావణ్య.. తన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో రెండ్రోజుల క్రితం తల్లిగారిల్లు ఎలిగేడు మండలం బుర్హాన్‌మియాపేటకు వచ్చింది. అయితే, కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లికి భోజనం ఇచ్చేందుకు శనివారం రాత్రి ఇంటినుంచి బయలుదేరి సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లి స్టేజీ వద్దకు చేరుకుంది. అక్కడ కరీంనగర్ వెళ్లేందుకు రాజీవ్ రహదారి దాటుతుందగా పెద్దపల్లి నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో లావణ్య అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్సై శ్రావణ్‌కుమార్, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. 108 వాహనంలో మృతదేహాన్ని సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించారు.
బావిలో పడి రైతు దుర్మరణం
వేములవాడరూరల్: వేములవాడ మండలంలోని ఫాజుల్‌నగర్‌కు చెందిన రైతు కీసరి అనిల్(37) ప్రమాదవశాత్తు కాలుజారి తన వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. అనిల్ శుక్రవారం రాత్రి పొలం వద్దకు వెళ్లాడు. ఒడ్డు పైనుంచి వెళ్తుండగా కాలు జారి బావిలో పడ్డాడు. మరుసటి రోజు ఉదయం వరకు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లి పరిశీలించగా బావిలో శవమై తేలాడు. మృతుని భార్య లత ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్రాజం తెలిపారు.
కొనుగోలు స్థలం కోసం ఘర్షణ
● రెండు తండాల మధ్య వివాదం
● వీర్నపల్లి మండలంలో ఉద్రిక్తత
వీర్నపల్లి(సిరిసిల్ల): మద్దిమల్లతండా గ్రామపంచాయతీ పరిధిలో శనివారం ధాన్యం కొనుగోలు స్థలం ఎంపికపై మ ద్దిమల్లతండా, మద్దిమల్లలొద్దితండాల మధ్య ఘర్షణ జరిగింది. స్థానికులు తెలి పిన వివరాలు. ఒక తండాకు చెందిన వారు స్థలాన్ని తామే చదునుచేసుకుంటామని కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని పట్టుబట్టగా.. తమకు కూడా హక్కు ఉందని మరోతండా వారు ప్రతిఘటించారు. దీంతో రెండు తండాల ప్రజల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తహసీల్దార్ ముక్తార్ పాషా, ఫారెస్ట్ ఆఫీసర్ రంజిత్‌కుమార్ అక్కడికి చేరుకొని ఇరువర్గాలతో మాట్లాడారు. అయినా రెండు తండాల ప్రజలు వినకపోవడంతో ఆ స్థలం అటవీశాఖకు చెందినదని.. ఇకపై అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు. ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు.
అమ్మకు టిఫిన్ ఇచ్చేందుకు వెళ్తూ అనంత లోకాలకు
అమ్మకు టిఫిన్ ఇచ్చేందుకు వెళ్తూ అనంత లోకాలకు


