
ఒంటరితనం భరించలేక వ్యక్తి ఆత్మహత్య
జ్యోతినగర్(రామగుండం): ఒంటరితనం భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. రామగుండం కార్పొరేషన్ ఇందిరమ్మకాలనీలో నివాసముంటున్న కాసుల రాకేశ్(34) తల్లి కర్మ ఈనెల 12న జరిగింది. అంతకముందే తండ్రి చనిపోయాడు. ఇద్దరూ మృతి చెందడంలో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడురోజుల క్రితం చనిపోగా ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి బావ కొమురోజు సుమన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్టీపీసీ పోలీసులు తెలిపారు.
గుండారంలో ఒకరు..
కమాన్‌పూర్(మంథని): మండలంలోని గుండారం గ్రామానికి చెందిన గుర్రాల రాజేశం(60) ఒంటరితనం భరించలేక గురువారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటరితనంతో పాటు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మృతుడి సోదరుడు చంద్రమౌళి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఉరేసుకుని యువకుడు..
వెల్గటూర్: ఉరేసుకుని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని శాఖాపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తనుగుల శివకుమార్ నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు. అక్కడే అనారోగ్యంతో మతిస్థిమితం కోల్పోయాడు. అక్కడి వారి సహాయంతో సొంత గ్రామానికి చేరుకున్నాడు. అప్పటినుంచి చికిత్స తీసుకుంటున్నాడు. ఈక్రమంలో గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. శివకుమార్‌కు భార్య, ఆరేళ్ల లోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శివకుమార్ తల్లి వీరమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
అనారోగ్యం భరించలేక మహిళ..
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణ శివారు రంగంపల్లి కి చెందిన పూదరి అనసూయ (54) గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై నరేశ్ తెలిపిన వివరాలు.. కొద్దిరోజుల క్రితం అనసూయ జారి పడగా కాలువిరిగింది. వైద్యం చేయించినా నొప్పి తగ్గకపోవడంతో బాధ భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై పేర్కొన్నారు.
గడ్డిమందు తాగి వ్యక్తి..
రామగిరి(మంథని): మండలంలోని కల్వచర్ల గ్రామపంచాయతీ పరిధి గోకుల్‌నగర్‌కు చెందిన జంగ రాజు(38) గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం కమాన్‌పూర్ మండలం జూలపల్లి గ్రామపంచాయతీ ముల్కలపల్లి వద్ద గడ్డి మందు తాగి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వెంటనే కుటుంబ సభ్యులు వరంగల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రాజుకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.
అప్పుల బాధతో రైతు..
రుద్రంగి(వేములవాడ): మండలకేంద్రానికి చెందిన రైతు పిట్టల నర్సయ్య (62) అప్పుల బాధతో పరుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. నర్సయ్య అప్పుల బాధతో మనస్తాపానికి గురై బుధవారం మధ్యాహ్నం తన పంట పొలం వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు గమనించి కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్ల ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.

ఒంటరితనం భరించలేక వ్యక్తి ఆత్మహత్య

ఒంటరితనం భరించలేక వ్యక్తి ఆత్మహత్య

ఒంటరితనం భరించలేక వ్యక్తి ఆత్మహత్య

ఒంటరితనం భరించలేక వ్యక్తి ఆత్మహత్య