
అలరించిన ఫేరియా ఫియెస్టా
● ప్రారంభించిన వీసీ ఉమేశ్‌కుమార్
సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఫేరియా ఫియెస్టా–2 పేరిట పర్యావరణహిత స్వదేశీ దీపావళి ప్రదర్శన క్యాంపస్ ఎకో బజా ర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శాతవాహన విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఉమేశ్‌కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పర్యావరణ స్నేహి జీవ న విధానాన్ని ప్రతిబింబించేవిధంగా ఏర్పాటు చేసిన పలు స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచా యి.కార్యక్రమంలో ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ కె.రామకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ డి.వరలక్ష్మి, ఈవెంట్ సమన్వయకర్త నల్ల మనోజ్‌కుమార్, విద్య, అకాడమిక్ కోర్డినేటర్ శ్రీనివాస్‌రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి రజనిదేవి పాల్గొన్నారు.
పెండింగ్ చలాన్ల వసూళ్లకు ప్రత్యేక బృందాలు
కరీంనగర్‌క్రైం: పెండింగ్ చలాన్ల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీపీ గౌస్ ఆలం వెల్లడించారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే 301 మంది ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారని.. వారి వాహనాలపై రూ.64,39,715 పెండింగ్ చలాన్లు ఉన్నాయని వివరించారు. పెండింగ్ చలాన్లు లేకుండా చూడాలని ప్రత్యేక బృందాలను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
శాతవాహన పరిధిలో నేటి పరీక్షలు వాయిదా
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో శనివారం జరగనున్న ఎంఏఎడ్ రెండో సెమిస్టర్, బీఫార్మసీ రెండో సెమిస్టర్, ఎల్‌ఎల్‌ఎం నాల్గో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాయిదా వేసిన ఎంఎడ్, బీఫార్మసీ పరీక్షలు 22న, ఎల్‌ఎల్‌ఎం పరీక్ష 29న నిర్వహించనున్నట్లు, మిగిలిన పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పులు లేవన్నారు.
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
తిమ్మాపూర్: చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె. వెంకటేశ్ అన్నారు. శుక్రవారం నుస్తులాపూర్ ఉన్నత పాఠశాల, ఎల్‌ఎండీ కాలనీలోని డైట్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి కె.వెంకటేశ్ సైబర్ చట్టాలు, బాల్య వివాహాలు, ఇతర న్యాయ పరమైన అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. చిన్న వయసులోనే మంచి నడవడిక అలవర్చుకోవాలని, విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం ముఖ్యమన్నారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ బాధ్యులు తనకు మహేశ్, న్యాయ సేవాధికార సంస్థ సభ్యుడు ఎ. కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేడు పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ తీగలకడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్‌కాలనీ, అంజనాద్రి దేవాలయం, దోబీఘాట్, గోదాంగడ్డ, బీఎస్‌ఎఫ్ క్వార్టర్స్, జెడ్పీ క్వార్టర్స్, భగత్‌నగర్, మల్లమ్మ మార్కెట్, కొమ్ము రాజు, గోదాం వెనక భాగం, రఘుపతిరెడ్డి హాస్పిటల్, తహారా మజీవ్, సంతోష్‌మాత దేవాలయం, సప్తగిరికాలనీ, ఆటోస్టాండ్, జానకి వీధి, మల్లికార్జునకాలనీ, సప్తగిరి హిల్స్, జెడ్పీ క్వార్టర్స్ ప్రాంతాలు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సర్కస్ మైదానం, పద్మనాయక కల్యాణ మండపం, ఐబీ చౌరస్తా, శ్రీలత అపార్ట్‌మెంట్, రామాలయం, రెనె ఆసుపత్రి, ఇందిరానగర్, ప్రశాంత్‌నగర్‌కాలనీ, హనుమాన్ దేవాలయం, కోర్టు వాటర్ ట్యాంక్ ప్రాంతాలు, ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు వ్యోక్స్‌వాగన్ లేన్, అల్కాపురి, పైపుల కంపెనీ ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1, 2 ఏడీఈలు పి.శ్రీనివాస్‌గౌడ్, ఎం.లావణ్య తెలిపారు.
కొత్తపల్లి, చింతకుంటలో..
విద్యుత్ తీగలకడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున శనివారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు 33/11 కేవీ కొత్తపల్లి, రేకుర్తి సబ్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలు, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చింతకుంటలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ జి.రఘు తెలిపారు.

అలరించిన ఫేరియా ఫియెస్టా