
సీపీఆర్‌పై అవగాహన అవసరం
కరీంనగర్ కార్పొరేషన్: ప్రాణాపాయం నుంచి కాపాడే సీపీఆర్ విధానంపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ సూచించారు. శుక్రవారం కళాభారతిలో నగరపాలకసంస్థ అధికారులు, ఉద్యోగులకు సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుండెపోటు వచ్చిన అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాపాయం నుంచి గట్టెక్కించవచ్చన్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకొని, శారీరక వ్యాయామం, యోగా లాంటివి అలవాటు చేసుకోవాలని సూచించారు. నగరపాలక సంస్థ అధికారులు, ఉద్యోగుల కోసం త్వరలో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ, నగరపాలకసంస్థ డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియొద్దిన్, వేణు మాధవ్, సహాయ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.