
చిన్నారుల ఆరోగ్యమే ముఖ్యం
గంగాధర: చిన్నారుల ఆరోగ్యమే ముఖ్యమని, పిల్లల్లో పోషణలోప నివారణకు ఐసీడీఎస్, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. గంగాధరలోని జిల్లా పరిషత్ పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోషణమాసం, శుక్రవారం సభ నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ శుక్రవారం ప్రభుత్వ పాఠశాల, ఆరోగ్యకేంద్రం, అంగన్‌వాడీసేవలను పర్యవేక్షించడంతో పాటు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీకేంద్రాల్లో విటమిన్ గార్డెన్ల ద్వారా కూరగాయల సాగు చేసి మధ్యాహ్న భోజనంలో వినియోగిస్తున్నామన్నారు. గర్భిణులు, బాలింతలు ఐరన్ మాత్రలు తీసుకోవాలని, ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు. అనంతరం వ్యాసరచన పోటీలు, గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. తహసీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో దమ్మని రాము, సీడీపీవో నర్సింగరాణి, ఎంఈవో ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.