విద్యార్థులకు లక్ష్మీకటాక్షం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు లక్ష్మీకటాక్షం

Oct 15 2025 6:32 AM | Updated on Oct 15 2025 6:32 AM

విద్యార్థులకు లక్ష్మీకటాక్షం

విద్యార్థులకు లక్ష్మీకటాక్షం

ఉన్నత చదువులకు చేయూత

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘పీఎం విద్యాలక్ష్మి’ పథకం అమలు

హామీ పత్రం లేకుండా రుణాలు

అర్హులకు 15 రోజుల్లోనే మంజూరు

ఇంటి నుంచి దరఖాస్తు చేసి రుణం పొందే అవకాశం

కేంద్ర పభుత్వ పథకం

పేద, మధ్యతరగతి వర్గాలకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందుకోసం 2015–16 నిధులు కేటాయించింది. అప్పటినుంచి ఏటా కేటాయింపులు జరుగుతూనే ఉన్నాయి. చదువుకు సంబంధించిన వివరాలు వాస్తవికతతో కూడి ఉంటే చాలు.. ఇంటి వద్దకు రుణం వస్తుంది. చాలామందికి ఈ పథకంపై అవగాహన లేకపోవడంతో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. విద్యారుణం పొందాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాలనే అపోహ విద్యార్థుల్లో ఉంది. ఆ అవసరం లేకుండా ఇంటి నుంచి దరఖాస్తు చేసి రుణం పొందే అవకాశం ఈ పథకం కల్పిస్తోంది. విద్యార్థులు బ్యాంకుల చుట్టూ తిరగకుండా దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే తక్కవ వడ్డీతో రుణం మంజూరయ్యేలా కేంద్రం పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక శాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్‌(ఏబీఏ) సంయుక్తంగా విద్యాలక్ష్మి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఎన్‌ఎస్‌డీఎల్‌ ఈ–గవర్నెన్స్‌ వ్యవస్థ ద్వారా ఈ పథకాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

నమోదు ఇలా..

విద్యాలక్ష్మి వెబ్‌సైట్‌లో పేరు, మొబైల్‌ నంబర్‌, ఈమెయిల్‌ ఐడీ, చిరునామా తదితర వివరాలను రిజిస్టర్‌ చేసుకోవాలి. ఆ తరువాత కామన్‌ ఎడ్యుకేషన్‌లోన్‌ అప్లికేషన్‌ ఫాంను పూర్తి చేయాలి. అవసరమైన ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. ఒక విద్యార్థి ఒక దరఖాస్తు మాత్రమే పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు స్టేటస్‌ను విద్యాలక్ష్మి పోర్టల్‌లో బ్యాంకు అప్‌డేట్‌ చేయగా.. 15 రోజుల్లో రుణ మంజూరు వివరాలు తెలుస్తాయి. అవసరమైన ధ్రువపత్రాలు లేకపోతే రుణం మంజూరయ్యే అవకాశముండదు. పోర్టల్‌లోని డాష్‌బోర్డులో చూసి విద్యార్థి విషయం తెలుసుకోవచ్చు. వీటికి ఎలాంటి గడువు తేదీ ఏమి లేదు. పోర్టల్‌లో నమోదు చేసుకున్నాక వెబ్‌సైట్‌లో లాగిన్‌ అవ్వాలి. అందులో అడిగిన వివరాలు నమోదు చేయాలి. ఒక విద్యార్థి ఒకేసారి గరిష్టంగా 3 బ్యాంకులకు విద్యారుణం కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది.

జాతీయ ఉపకార వేతనాలకు సైతం..

విద్యాలక్ష్మి పోర్టల్‌ ద్వారా జాతీయ ఉపకార వేతనాలకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉన్నత చదువులు పూర్తి చేసిన వారిని పోర్టల్‌లో అనుసంధానం చేయడంలో భాగంగా ప్రతిభ ఉపకార వేతనాల వివరాలు పొందుపరుస్తున్నారు. రుణాలు, ఉపకార వేతనాలు అందుకొని స్థిరపడిన వారి స్ఫూర్తిదాయక గాథల్ని ప్రేరణగా పేజీల్లో ఉంచారు.

బ్యాంకుల ద్వారా..

ఈ పోర్టల్‌లో 36 బ్యాంకులు నమోదై ఉన్నాయి. అవి విద్యారుణాలను అందిస్తున్నాయి. ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్‌, విజయ, ఐవోబీ, యూనియన్‌, ఆంధ్రాబ్యాంక్‌, ఐడీబీఐ, యూబీఐ, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, యూకో, దీనా, కరూర్‌వైశ్య, సిండికేట్‌, జీఏఏబీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేషన్‌ బ్యాంక్‌, యాక్సిస్‌, ఫెడరల్‌, న్యూ ఇండియా, ఆర్‌బీఎల్‌, అలహాబాద్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తదితర బ్యాంకుల నుంచి రుణాలు పొందొచ్చు.

ఏఏ కోర్సులకు..

విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.4లక్షల లోపు ఉండాలి. అలాగే ఇంజనీరింగ్‌, టెక్నికల్‌ కోర్సులు, వృత్తి సంబంధిత కోర్సులైన ఎంబీబీఎస్‌, ఆర్కిటెక్చర్‌, లా, చార్టర్డ్‌ అకౌంటెన్సీ, అండర్‌ గ్రాడ్యుయేట్‌, విమానయాన రంగానికి సంబంధించిన చదివే విద్యార్థులకు రుణాలు అందించనుంది. దీంతోపాటు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేవారికి రుణాలు మంజూరు చేస్తారు. యూజీసీ, ఏఐసీటీఈ ఇతర ప్రభుత్వ ఆధీకృత సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వారికి రుణాలందుతాయి.

దరఖాస్తు విధానం

విద్యార్థుల కోసం 3 పద్ధతుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటగా విద్యాలక్ష్మి పోర్టల్‌లో నమోదు కావాలి. తర్వాత వివరాలతో కూడిన దరఖాస్తు పూరించాలి. చివరగా వివిధ రకాల బ్యాంకులను ఎంపిక చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయితే రుణానికి సంబంధించిన వివరాలు మొబైల్‌, ఈమెయిల్‌కు ఎప్పటికప్పుడు సమాచారమందుతుంది.

జత చేయాల్సిన పత్రాలు

విద్యాలక్ష్మి పథకంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద విద్యారుణాలు పొందేందుకు విద్యార్థులు పలు పత్రాలను దరఖాస్తుతోపాటు జత చేయాల్సి ఉంటుంది. చదివిన విద్యాసంస్థ నుంచి ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌(టీసీ), మార్కుల జాబితా, ఇంతవరకు పొందిన ఉపకార వేతన పత్రాలు, ఉన్నత విద్యకు సంబంధించిన ర్యాంకు కార్డు, ప్రవేశ అనుమతి పత్రాలు, చదవాల్సిన కోర్సుకు చెందిన ఫీజుల అంచనా వివరాలు, తల్లి, తండ్రి, సంరక్షకుడు, విద్యార్థికి సంబంధించిన పాస్‌ ఫొటోలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులయితే వారి వేతన సర్టిఫికెట్లు, ఆస్తి వివరాలు, నివాస ధ్రువీకరణ కోసం ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు లాంటివి జత చేయాలి.

కరీంనగర్‌: ప్రతిభ ఉన్నా ఉన్నత విద్య పేద బిడ్డలకు అందని ద్రాక్షలా మారుతోంది. దీనికి ఆర్థిక పరిస్థితులే కారణమవుతున్నాయి. ఉన్నత విద్య, విదేశాల్లో చదువు కోసం గతంలో విద్యార్థులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. సిఫార్సులు, ఆస్తిపాస్తులు, ఉద్యోగ పూచీకత్తులు సమర్పించాల్సి వచ్చేది. అయినా రుణం మంజూరవుతుందో లేదో తెలియని పరిస్థితి. ప్రస్తుతం అవేమీ అక్కర్లేదు. ఉన్నత చదువులకు పీఎం విద్యాలక్ష్మి పథకం చేయూతనిస్తోంది.

ఎంతవరకు రుణం?

రుణం అవసరమైన విద్యార్థి నేరుగా దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. మంజూరు చేసే రుణంలో చదువుకయ్యే ఖర్చు మాత్రమే కాకుండా ట్యూషన్‌ ఫీజు, వసతి, రవాణా ఖర్చులన్నింటినీ కలుపుతారు. ఇందులో దరఖాస్తు ఫీజు, ప్రాసెసింగ్‌ చార్జీలు ఏమి ఉండవు. మొత్తం 3 రకాలుగా రుణాలిస్తారు. మొదటి దశ రూ.4లక్షల వరకు, రెండో దశ రూ.4లక్షల నుంచి రూ.7.5లక్షల వరకు, మూడో విడత రూ.10లక్షల వరకు తక్కువ వడ్డీతో రుణాలందిస్తారు. విద్యాలక్ష్మి పథకం ద్వారా రూ.10లక్షల వరకు రుణం పొందొచ్చు. ఇందులో రూ.4.5లక్షల వరకు రుణానికి కేంద్ర ప్రభుత్వమే వడ్డీ భరిస్తోంది. అమ్మాయిల చదువును ప్రోత్సహించడంలో భాగంగా విద్యార్థినులకు మరింత రాయితీ కల్పిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement